Homeభక్తిశ్రీ చైతన్య మహాప్రభువు… భక్తి ఉద్యమానికి మేలుకొలుపు

శ్రీ చైతన్య మహాప్రభువు… భక్తి ఉద్యమానికి మేలుకొలుపు

  • జూన్ 14…చైతన్య మహాప్రభువు వర్ధంతి

చైతన్య మహాప్రభువు ( ఫిబ్రవరి 18, 1486 – జూన్ 14, 1534) భారతీయ భక్తి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఒక మహా యోగి, భక్తుడు. ఆయనను శ్రీకృష్ణుని అవతారంగా భావిస్తారు. ముఖ్యంగా హరీనామ సంకీర్తన ద్వారా కృష్ణభక్తిని ప్రచారం చేసి, భక్తి మార్గాన్ని సమస్త జనులకు అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఆయన జీవితం, బోధనలు, భక్తి మార్గంపై ప్రభావం భారతీయ సంస్కృతికి అపారమైన మార్గదర్శనం కల్పించాయి.

శ్రీ చైతన్య మహాప్రభువు 1486లో పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో, మాయాపూర్ గ్రామంలో జన్మించారు. ఆయన అసలు పేరు విశ్వంభర మిశ్రా. చిన్నతనం నుంచే అపారమైన మేధస్సుతో, సంస్కృత శాస్త్రాలలో ప్రావీణ్యం సాధించి, యువకాలంలోనే గొప్ప తత్వవేత్తగా పేరుగాంచారు. ఆయనను అభిమానంతో నిమాయి పండిట్ అని పిలిచేవారు.

- Advertisement -
Sri Chaitanya Mahaprabhu and the Legacy of the Bhakti Movement1

విద్యాభ్యాసం పూర్తయిన తరువాత, కృష్ణ భక్తి మార్గంలో నిమగ్నమై హరి నామ సంకీర్తన చేయడం ప్రారంభించారు. ప్రజలందరికీ కృష్ణభక్తిని చేరువ చేయడం తన జీవిత ధ్యేయంగా మలుచు కున్నారు. ఆయన భార్య లక్ష్మీదేవిని కోల్పోయిన తరువాత మరింత భక్తి మార్గంలో శ్రద్ధ పెట్టి, ఆధ్యాత్మికతను స్వీకరించారు.

1510లో, కేశవ భారతీ స్వామి వద్ద సన్యాసం స్వీకరించి “శ్రీ కృష్ణ చైతన్య” అనే పేరు పొందారు. అనంతరం జగన్నాథ పురీలో స్థిరపడి, అక్కడ కీర్తన, భక్తి ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఆయన అనుచరులతో కలిసి పలు ప్రాంతాలు సందర్శించి, కీర్తనల ద్వారా భక్తి మార్గాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు.

భగవంతుని నామస్మరణే మోక్షానికి మార్గమని ప్రకటించి, హరే కృష్ణ మహామంత్రాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. కేవలం బ్రాహ్మణులకే భక్తి సాధ్యమనే తప్పుడు భావనను ఖండించి, అన్ని వర్గాల వారికీ భక్తి మార్గం తెరిచారు. జీవాత్మ, పరమాత్మ ఒకటే అయినప్పటికీ, ఒక ప్రత్యేక స్వరూపాన్ని కలిగి ఉంటాయని ఉపదేశించారు. భగవంతుడి పట్ల అపారమైన ప్రేమ, విరహ తపన ద్వారా పరమ ఆనందాన్ని పొందవచ్చని చెప్పారు. రాజులు, మునులు, ప్రజలు, దళితులు, విదేశీయులందరికీ కృష్ణ భక్తిని తెలియజేశారు.

Sri Chaitanya Mahaprabhu and the Legacy of the Bhakti Movement

చైతన్య మహాప్రభువు జాగృతావస్థలోనూ, సమాధి స్థితిలోనూ అత్యున్నత భక్తి స్థాయిని అనుభవించేవారు. జాగృతావస్థలో కృష్ణ వియోగ వేదనలోని సుఖాన్ని, సమాధిలో కృష్ణ సంయోగ సుఖాన్ని అనుభవించేవారని ఆయన అనుచరులు చెబుతారు.

ఆయన సిద్ధాంతాలను అనుసరించి ఆయన శిష్యులు అనేక గ్రంథాలు రచించారు. ప్రసిద్ధ రచనలలో రూప గోస్వామి – భక్తి రసామృత సింధువు, ఉజ్జ్వల నీలమణి, సనాతన గోస్వామి – వైష్ణవతోషిణి జీవ గోస్వామి – సత్సందర్భం, భాగవత టీక, భక్తి సిద్ధాంతం, ఉపదేశామృతం. ఈ గ్రంథాలు గౌడియ వైష్ణవ సంప్రదాయానికి మూలస్తంభాలుగా నిలిచాయి.

Sri Chaitanya Mahaprabhu and the Legacy of the Bhakti Movement3.jpg1

చైతన్య మహాప్రభువు 1534 జూన్ 14న తన 48వ ఏట జగన్నాథ ఆలయంలో పూజా నిమిత్తం ప్రవేశించి, తిరిగి వెలుపల రాలేదని ఒక కథనం ఉంది. మరికొన్ని కథనాల ప్రకారం, ఆయన భగవత్తత్వంలో మునిగిపోయి నదిలో అంతరించి పోయారని చెబుతారు.

చైతన్య మహాప్రభువు భక్తి ఉద్యమానికి ఊపిరిపోసిన మహానుభావుడు. ఆయన జీవితం, బోధనలు కేవలం భారత దేశానికే కాదు, ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులకు మార్గదర్శనం చేస్తున్నారు. ఆయన ప్రవేశపెట్టిన హరి నామ సంకీర్తన సంప్రదాయం నేటికీ కొనసాగుతూనే ఉంది.

“హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే |
హరే రామ హరే రామ రామ రామ హరే హరే”

ఈ మహామంత్రం ద్వారా భక్తి మార్గంలో అంతులేని ఆనందాన్ని అనుభవించవచ్చు అని శ్రీ చైతన్య మహాప్రభువు చూపిన మార్గం యుగయుగాల పాటు వెలుగొందుతూనే ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News