- 300 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థుల భారీ ర్యాలీ
- కార్యక్రమంలో పాల్గొన్న :-డైరెక్టర్స్ రామేశ్వరెడ్డి, నర్సింహులు గౌడ్
హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ పీవీ పాఠశాల విద్యార్థులు దేశభక్తిని చాటుతూ 300 అడుగుల భారీ జాతీయ జెండాతో మేడ్చల్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు చేతబూనిన జాతీయ జెండాలు, దేశభక్తి నినాదాలు, స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తిదాయక నినాదాలతో ర్యాలీ ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. రహదారుల వెంట ర్యాలీని చూసిన ప్రజలు విద్యార్థులను అభినందించడంతో పాటు జాతీయ జెండాకు గౌరవం తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ విద్యార్థులు చేసిన నినాదాలు పలువురిని ఆకట్టుకున్నాయి.
దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మహనీయుల స్ఫూర్తిని నేటి తరం విద్యార్థుల్లో నింపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పాఠశాల నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పీవీ పాఠశాల చైర్మన్ రామేశ్వర్ రెడ్డి, డైరెక్టర్ నర్సింలు గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని, వారి ఆశయాలను నేటి తరం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు.

విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే దేశభక్తి, జాతీయ సమైక్యత, సామాజిక బాధ్యత వంటి విలువలను పెంపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కేవలం స్వాతంత్ర్య దినోత్సవం రోజున మాత్రమే కాకుండా నిత్యజీవితంలోనూ దేశం పట్ల బాధ్యతతో వ్యవహరించేలా విద్యార్థులను తీర్చిదిద్దడమే పాఠశాల లక్ష్యమన్నారు. ఇలాంటి దేశభక్తి కార్యక్రమాలు విద్యార్థుల్లో జాతీయ భావాలను మరింత బలోపేతం చేయడంతో పాటు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తుచేసేలా చేస్తాయని వారు తెలిపారు. భవిష్యత్‌లోనూ విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావాన్ని పెంపొందించే మరిన్ని కార్యక్రమాలను నిర్వహిస్తామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు అనిత, అరిఫ్, సుజిత్ ,విద్యార్థులు పాల్గొన్నారు.
