- ప్రకృతి ప్రేమికుడిగా వేంకటేశ్వరుడు..
వేంకటేశ్వరస్వామి కొండలపైనే ఎక్కువగా ఆవిర్భవిస్తూ ఉంటాడు. అయితే ఎక్కడ వెలసినా స్వామి విగ్రహం మాత్రం స్థానక మూర్తిగానే అంటే నిలుచున్న భంగిమలోనే దర్శనమిస్తుంది. కానీ ఒక క్షేత్రంలో వెలసిన వేంకటేశ్వర స్వామి చాలా ప్రత్యేకం. ఇక్కడ స్వామి శయనముద్రలో దర్శనమివ్వడం విశేషం. ఈ అరుదైన ఆలయం ఎక్కడుంది? ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
సహజంగా వేంకటేశ్వరస్వామి ప్రకృతి ప్రేమికుడిగా కనిపిస్తాడు. ఎందుకంటే స్వామి ఎప్పుడు పచ్చని కొండలపైనే ఎక్కువగా ఆవిర్భవిస్తూ ఉంటాడు. అలా స్వామివారు తిరుమల కాకుండా కొండపై వెలసిన మరో క్షేత్రమే ‘అమ్మపేట’. ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిధిలో ఉండే అమ్మపేట క్షేత్రంలో శ్రీనివాసుడు శయనముద్రలో కొండపై వెలసి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఈ గ్రామంలోకి ప్రవేశించగానే దూరంగా కొండపై వెలసిన ఆలయం కనిపిస్తుంది. సాధారణంగా కొండ అంటే కొన్ని చిన్న చిన్న బండరాళ్ల సముదాయంగా ఉంటుంది. కానీ అమ్మపేటలో మాత్రం అతి పెద్ద బండరాళ్లు దర్శనమిస్తాయి. ఒకే చోట నిలుచుని ఒక బండరాయిని పూర్తిగా చూడలేం అంటే అవి ఎంత పెద్ద బండరాళ్లో అర్ధం చేసుకోవచ్చు.
కొండపై భాగంలో ఒక పెద్ద బండరాయి వేదికగా, మరో పెద్ద బండరాయి పైకప్పుగా ఉంటే ఆ రెండింటి మధ్యలో వేంకటేశ్వరస్వామి శయనముద్రలో వెలసి ఉండడం విశేషం. ఇక్కడ వేంకటేశ్వర స్వామి వెలిగొండ వేంకటేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. ఈ స్వామి స్వయంభువు అని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం స్వామివారు ఒక భక్తుడికి స్వప్నంలో దర్శనమిచ్చి తన ఉనికిని తెలిపి, తానున్న ప్రదేశం ఆనవాళ్లను తెలియజేశాడంట! అలా ఇక్కడ స్వామివారు వెలుగులోకి వచ్చినట్లు ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.
రామాయణం ప్రకారం సీతారాములు భద్రాచలం వెళ్తూ మార్గమధ్యంలో ఈ ప్రదేశంలో కొంతసేపు విశ్రమించారని తెలుస్తోంది. ఇందుకు నిదర్శనంగా ఇక్కడ సీతమ్మవారి పాదముద్రలు కూడా చూడవచ్చు. సీతమ్మ వారి పాదస్పర్శతో పునీతమైన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి ‘అమ్మపేట’ అని పేరు వచ్చిందని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. కొండపైకి చేరుకోవడానికి మెట్ల మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. మెట్లు ఎక్కేటప్పుడు రెండువైపులా ఆధారం కోసం ఎవరో పేర్చినట్లుగా బండరాళ్లు ఉండడం విశేషం.
ఇది భగవంతుని లీలావిశేషమే అని స్థానికులు భక్తిపారవశ్యంతో చెబుతారు. చుట్టూ పంట పొలాల మధ్య ఎవరో తెచ్చి పెట్టినట్లుగా ఉండే ఈ కొండ ప్రత్యేకంగా ఉంటుంది. దూరం నుంచి పరిశీలనగా చూస్తే ఈ కొండ ఏనుగు ఆకారంలో ఉంటుంది. సరిగ్గా ఏనుగు తల పైభాగంలో వేంకటేశ్వర స్వామి ఆలయం వెలసి ఉండడం విశేషం. శ్రీనివాసుని శిరస్సున మోస్తున్న గజేంద్రుని వలే ఈ కొండ దర్శనమిస్తుంది.
