Homeభక్తిSubrahmanya Swamy | సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే దోషాలు తొలుగుతాయి..

Subrahmanya Swamy | సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే దోషాలు తొలుగుతాయి..

  • కుజ గ్రహానికి అధిపతి సుబ్రహ్మణ్యుడు..
  • ప్రతి మంగళవారం ఆయనకు ప్రీతిపార్థం..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజ దోషం, నాగదోషం కారణంగా వివాహ సంబంధిత సమస్యలు, సంతానం కలగక పోవడం, జీవితంలో ఎదుగుదల లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. పురాణాల ప్రకారం కుజ గ్రహానికి అధిపతి సుబ్రహ్మణ్యుడు. ఈ స్వామిని పూజిస్తే ఎలాంటి దోషాలైనా తొలగుతాయని విశ్వాసం. సుబ్రహ్మణ్యుని ఆరాధనకు ప్రతి మంగళవారం శ్రేష్టమైనది. అలాగే చవితి తిథి, ఆషాఢ మాసంలో వచ్చే కృత్తికా నక్షత్రం రోజు, మార్గశిర మాసంలో వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి మరింత ప్రత్యేకం. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యుని ఆరాధనకు విశిష్టమైన ఆడికృత్తిక గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

స్కంద పురాణం ప్రకారం సుబ్రహ్మణ్యుని జన్మ నక్షత్రం కృత్తికా నక్షత్రం. ప్రతి మాసంలో కృత్తికా నక్షత్రం వచ్చినప్పటికీ ఆషాఢ మాసంలో వచ్చే కృత్తికా నక్షత్రం మరింత ప్రత్యేకం. ద్రవిడ సంప్రదాయం ప్రకారం తమిళులకు ఆషాఢ మాసం అత్యంత పవిత్రమైనది. ఈ మాసంలో వచ్చే కృత్తికా నక్షత్రాన్ని ఆడికృత్తిక అంటారు.

- Advertisement -

‘ఆడి’ అంటే తమిళంలో ఆషాఢం అని అర్ధం. ఆడికృత్తిక అంటే సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన ఆషాఢ మాసంలో వచ్చే పండుగ. ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లలో ఈ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఆషాఢ మాసంలో వచ్చే ఈ నక్షత్రం రోజు స్వామిని పూజిస్తే విశేష ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది. ఆడికృత్తిక గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.

తెలుగు పంచాంగం ప్రకారం ఆగస్టు 7, శుక్రవారం ఆషాఢ మాసంలో వచ్చే కృత్తిక నక్షత్రం సందర్భంగా ఈ రోజునే ఆడికృత్తిక పర్వదినాన్ని జరుపుకోవాలని పంచాంగ కర్తలు సూచిస్తున్నారు. వివాహం ఆలస్యం అవుతున్న వారు, సంతానం లేనివారు, జీవితంలో స్థిరత్వం లేక కష్టాలు ఎదుర్కొంటున్న వారు ఆడికృత్తిక రోజున ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యుడిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. తమిళనాడులోని సుప్రసిద్ధ సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలైన ఆరుపడై వీడు పళని, తిరుత్తణి, స్వామిమలై, తిరుచెందూర్, పాజమలై, తిరుప్పరంకుండ్రం మొదలైన ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలు సుబ్రహ్మణ్య స్వామి నివసించే 6 ఇళ్లుగా చెబుతారు.

తమిళంలో ‘వీడు’ అంటే ఇల్లు అని అర్ధం. ఈ ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఆడికృత్తిక పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ఆడికృత్తిక పర్వదినం రోజు సంతానం కోరుకునే వారు నియమ నిష్టలతో ఉపవాసం ఉండాలి. సూర్యోదయానికి ముందే నిద్ర లేచి శుచియై ముందుగా పూజామందిరాన్ని శుభ్రం చేసుకొని వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి పటాన్ని గంధం కుంకుమలతో అలంకరించాలి. అలాగే వినాయకుడు, శివపార్వతుల చిత్రపటాలను కూడా ప్రతిష్టించుకోవాలి. సుబ్రహ్మణ్యుని ఎరుపు రంగు పూలతో పూజించాలి. ఎర్ర చందనం సమర్పించాలి.

ముందురోజు రాత్రే బియ్యాన్ని నీటిలో నానబెట్టి ఉంచుకోవాలి. పండుగ రోజు ఉదయాన ఈ బియ్యాన్ని ఇంట్లోనే పిండిగా తయారుచేసి అందులో బెల్లం, ఆవు నెయ్యి కలిపి, ఆ మిశ్రమంతో 5, 9 లేదా 11 ప్రమిదలు తయారు చేసుకోవాలి. ఈ ప్రమిదల్లో ఆవునెయ్యి పోసి వత్తులు వేసి దీపారాధన చేయాలి. ఈ దీపాలను సుబ్రహ్మణ్యస్వామి ఎదుట ఉంచి అక్షింతలతో దీపపూజ చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కోసం ఈ రోజు సుబ్రహ్మణ్య అష్టకం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి చరిత్ర విధిగా పారాయణ చేయాలి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News