- వర్షఋతువు మొదలయ్యే మాసం..
- లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం మాసం..
శ్రావణ మాసం రాకతో వర్షరుతువు మొదలవుతుంది. పరిసరాలన్నీ పచ్చగా కళకళలాడే వర్షాకాలంలో వచ్చే శ్రావణంలో ఇళ్లన్నీ పూజాదికాలతో శోభిల్లుతాయి. లక్ష్మీదేవికి ప్రీతికరమైన శ్రావణంలో లక్ష్మీనారాయణుల ఆరాధన ప్రత్యేకం. ఈ మాసంలో ప్రతి రోజూ, ప్రతి ఘడియా శుభసమయంగా పరిగణిస్తారు. ఈ మాసాన్ని నభోమాసం అని కూడా అంటారు. నభో అంటే ఆకాశం అని అర్థం. ఆకాశంలో కలిగే మార్పులను, ప్రకృతిలో చోటుచేసుకునే పరిణామాలను సమతుల్యం చేయడానికి అనువైన మాసం శ్రావణం.
ఈ మాసంలో రవి సంచరించే నక్షత్రాల ప్రభావం చంద్రుని కారణంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఈ దుష్ఫలితాలను నివారించడానికి, మంచి కలిగించే దిశగా ధర్మాచరణను పండుగగా ఆచరించే క్రమంలోనే శ్రావణ మాస నియమం ఏర్పడింది. మనసు మీద మంచి ప్రభావం చూపించి మానసిక ప్రశాంతత పొందడానికి, ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల కలిగే అనార్యోగాల బారినుంచి కాపాడుకోవడానికి శ్రావణం అనువైనది. ఈ మాసంలో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించాలంటూ నియమబద్ధం చేయడం శ్రావణం పట్ల మహర్షుల ముఖ్య ఉద్దేశంగా చెప్పాలి.
ఒకవైపు ఆధ్యాత్మికంగా, మరోవైపు శాస్త్రీయంగా ఈ మాసం సకల జనులకు శ్రేయస్సును కలుగజేస్తుంది. శ్రావణ మాసంలో పండుగలు వెల్లువలా వస్తాయి. ఈ మాసంలో తెలుగునాట గుమ్మాలకు పెట్టే పసుపు కుంకుమలతో, సందడి చేసే మహిళలతో ప్రతీరోజూ ఇంటింటా పండుగ వాతావరణం కనిపిస్తుంది. శ్రావణం మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఏరోజుకారోజు ప్రత్యేకమే! శ్రావణ సోమ, మంగళ, శుక్ర, శనివారాలు..
అంటే వారంలో నాలుగురోజులూ ఎక్కడ చూసినా స్త్రీపురుషులు వ్రత నియమాలతో కూడి ఆధ్యాత్మిక భావంతో కనిపిస్తారు. మంగళ, శుక్రవారాల్లో అమ్మవారిని పూజించి వ్రతాలు చేయడం ఆచారం. శ్రావణం శివకేశవులకు ప్రీతిపాత్రమైన మాసంగా సోమ, శనివారాల్లో ప్రత్యేకంగా పూజలు చేస్తారు. శ్రావణ సోమవారాలు శివుడిని ఆరాధిస్తే, శనివారాల్లో వేంకటేశ్వరస్వామిని పూజించడం, ఉపవాసాలు ఉండటం గమనిస్తుంటాం.
