- పిల్లలను వదిలేసి ప్రియుడితో పరార్..
- మహారాష్ట్రలో వెలుగుచూసిన ఘటన..
ఒక మహిళ తన ఇద్దరు పిల్లలను బస్సులో వదిలేసింది. ఆ పిల్లలు అనాథలని, వారిని మరో బస్సు ఎక్కించాలని పేర్కొంటూ ఒక చీటీ రాసింది. ఒక పిల్లవాడి జేబులో ఆ చీటీ ఉంచి తన ప్రియుడితో కలిసి ఆమె పారిపోయింది. మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఏప్రిల్ 30న ఒక మహిళ తన తండ్రికి చెందిన స్కూటర్, కొంత డబ్బును చోరీ చేసింది. ఇద్దరు పిల్లలతో కలిసి తండ్రి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఈ నేపథ్యంలో తన స్కూటర్, ఇంటి నుంచి డబ్బును కూతురు చోరీ చేసి పారిపోయినట్లు ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కాగా, ఆ మహిళ తన ఇద్దరు పిల్లలను పండర్‌పూర్-సంభాజీ నగర్ బస్సులో కూర్చోబెట్టింది. ‘ఈ పిల్లలకు తల్లిదండ్రులు లేరు. దయచేసి యవత్మాల్ వెళ్లే బస్సులో వారిని ఎక్కించండి’ అని పేపర్‌పై రాసింది. అందులో తన తండ్రి మొబైల్ నంబర్ పేర్కొంది. ఆ తర్వాత తండ్రికి చెందిన చోరీ స్కూటర్‌పై ప్రియుడితో కలిసి పారిపోయింది.
