- జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
ప్రజలు ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సోమవారం సాయంత్రం సారంగాపూర్ మండలం ధని గ్రామంలో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా గ్రామసభ ఏర్పాటు చేసి, అరైవ్ లైవ్ కార్యక్రమం నిర్వహించి గ్రామస్తులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పాల్గొన్నారు.
వీరికి గ్రామస్థులు పూల మొక్కలు అందించి, స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, ప్రజల్లో రోడ్డు భద్రత పై అవగాహన కల్పించాలని ఉద్దేశ్యంతో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా గ్రామసభ ఏర్పాటు చేసి, అరైవ్ లైవ్ వారోత్సవాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలలో ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించుకోవచ్చు అని అన్నారు.
గ్రామంలో రోడ్డు ప్రమాదాల నివారణకు, గ్రామ రోడ్డు భద్రత కమిటీ ఏర్పాటు అభినందనీయమని ప్రశంసించారు. ఈ కమిటీ ద్వారా గ్రామంలో ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలు పాటించేలా చొరవ చూపాలని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని చెప్పారు. ట్రాఫిక్ నియమాలు పకడ్బందీగా పాటించడం వల్లనే వాహనదారులు తిరిగి ఇండ్లకు సురక్షితంగా చేరుకోగలుగుతారని వివరించారు.

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ఇప్పటికే పారిశుధ్య పనులు పూర్తిచేసుకుని, ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు నిర్వహించుకున్నామని అన్నారు.గ్రామంలో బ్రిడ్జి సమస్య ఉందని గ్రామస్తులు కలెక్టర్ దృష్టిని తీసుకురాగా, స్పందించిన కలెక్టర్, బ్రిడ్జి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ, ప్రజలంతా రోడ్డు భద్రత నియమాలు బాధ్యతగా పాటించాలని అన్నారు.
చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా రోడ్డు ప్రమాదాలు నిర్మూలించగలుగుతామని చెప్పారు. జిల్లాలో ఇటీవలి రోడ్డు ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారని, వారి కుటుంబాలకు ఎంతో నష్టం కలిగిందని అన్నారు. గ్రామంలో ఏర్పాటు అయిన గ్రామ రోడ్డు భద్రత కమిటీల ద్వారా, గ్రామస్థులు తప్పనిసరి రోడ్డు భద్రత నియమాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. హెల్మెట్ లేనిదే ద్విచక్ర వాహనాలు నడపరాదని, లైసెన్స్ సహా, వాహనాలకు అన్ని పత్రాలు ఉంచుకోవాలన్నారు.
సీట్ బెల్ట్ తప్పని సరి ధరించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు అదుపు చేసే సామర్థ్యం ఉండదని, ఎట్టిపరిస్థితుల్లో మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సాయికిరణ్, డిపిఓ శ్రీనివాస్, ఎంవిఐ మహేందర్, తహసిల్దార్ సంధ్యారాణి, ఎంపీడీవో లక్ష్మికాంత రావు, ఆర్ అండ్ బి ఈఈ సుభాష్, మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాది, సర్పంచ్ పోతన్న ఉప సర్పంచ్ నారాయణ, ఇతర అధికారులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.
