- జిల్లా కలెక్టర్ రాజర్షి షా
- బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
జిల్లాలో రైతులకు ఎరువుల కొరత తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. వర్షాకాల సాగు నేపథ్యంలో బుధవారం గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని యూరియా గోదామును, యూరియా బుకింగ్ ప్రక్రియను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాములో అందుబాటులో ఉన్న యూరియా నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, పంపిణీ వివరాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.
అనంతరం ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్ ద్వారా రైతుల నమోదులు, బుకింగ్ విధానం, పంపిణీ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. బుకింగ్ ప్రక్రియలో రైతులకు ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే పరిష్కరించాలని, యాప్ సమర్థవంతంగా పనిచేసేలా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
జిల్లా వ్యాప్తంగా రైతుల అవసరాలకు అనుగుణంగా సరిపడా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న డిజిటల్ బుకింగ్ విధానం ద్వారా ఎరువుల పంపిణీ పూర్తిస్థాయి పారదర్శకతతో జరుగుతోందని, దీంతో బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలు, అక్రమ విక్రయాలకు పూర్తిగా అడ్డుకట్ట పడుతుందని పేర్కొన్నారు.
ఎరువులను నిర్ణీత గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్పీ)కే విక్రయించాలని, అధిక ధరలకు విక్రయించడం, అక్రమంగా నిల్వ చేయడం లేదా పక్కదారి పట్టించడం వంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. రైతులు తమకు అవసరమైన మేరకే ఎరువులను కొనుగోలు చేయాలని, ఒకేసారి అధిక మొత్తంలో నిల్వ చేసుకోవద్దని సూచించారు. సహకార సంఘాల ద్వారా ప్రతి రైతుకు సకాలంలో యూరియా అందేలా వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. రైతులకు ఎరువుల సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపడుతోందని కలెక్టర్ తెలిపారు.
ఈ పరిశీలనలో పీఏసీఎస్ సిబ్బంది పూర్ణచందర్, రైతులు తదితరులున్నారు.
