- చేరికలు లభిస్తున్న విశేష స్పందన..
- ఫలితమిస్తున్న ఇంటింట ప్రచారం..
- ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ గౌరీ శంకరా చారి..
విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా సోమవారం అబ్దుల్లాపూర్ మెట్ మండల్, బాటసింగారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో కొత్త అడ్మిషన్ల కోసం గ్రామంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఎర్రవెల్లి గౌరీ శంకరాచారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాసరి ప్రతాప్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో మాట్లాడుతూ మన పాఠశాలలో ఎస్ ఎస్ సి 2026 ఫలితాల్లో 98.55 శాతం ఉత్తీర్ణత సాధించారని 69 మందిలో ఒక్కరు ఫెయిలయ్యారని తెలిపారు, ప్రభుత్వ పాఠశాలలో అర్హత కలిగిన, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని తెలిపారు. చదువుతో పాటు ఆటలు, పాటలు, క్రీడలు మరియు ఇతర సహ పాఠ్య కార్యక్రమాలకు కూడా ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు.
ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకంతో పాటు వచ్చే విద్యా సంవత్సరం నుండి ఉదయం అల్పాహారం, పాలు, రాగి జావ వంటి పోషకాహారం అందించబడుతుందని తెలిపారు. అలాగే విద్యార్థులకు ఉచితంగా రెండు జతల యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు అందిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య అందించబడుతున్నట్లు తెలియజేశారు.
గత విద్యా సంవత్సరంలో బాటసింగారం పాఠశాల విద్యార్థులు క్రీడల్లో మండల, జిల్లా స్థాయిలలో అనేక విజయాలు సాధించడంతో పాటు కొన్ని క్రీడా అంశాల్లో రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతిభ చాటినట్లు తెలిపారు.
ఈ ప్రచార కార్యక్రమంలో గ్రామంలోని సుమారు 20 మంది విద్యార్థులు బాటసింగారం ప్రభుత్వ పాఠశాలలో చేరేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. గ్రామంలోని బడీడు పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలో చేరి, అందుబాటులో ఉన్న సౌకర్యాలను వినియోగించుకోవాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యతో పాటు మంచి విలువలు, సంస్కారం కూడా అందించబడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
