- మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది..
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్‌పూర్ జిల్లా బర్గీ డ్యామ్ లో జరిగిన క్రూయిజ్ బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య 13కి పెరిగింది. ఆదివారం మరో రెండు మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. వారిలో ఐదేళ్ల బాలుడు, 50 ఏళ్ల వ్యక్తి ఉన్నారు. ఐదేళ్ల బాలుడు మయూరామ్ కు 50 ఏళ్ల కామరాజ్ మేనమామగా గుర్తించారు. ఈ ఇద్దరితో కలిసి బోటు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 13కు చేరినట్లయ్యింది. మరో ఇద్దరి ఆచూకీ లభ్యం కావాల్సి ఉంది.
మూడు రోజుల క్రితం అంటే ఏప్రిల్ 30న సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. అదేరోజు స్థానికులు, సహాయక బృందాలు కలిసి 28 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మరో 9 మృతదేహాలను వెలికి తీశారు. ఆ తర్వాత రోజు మరో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇవాళ మరో రెండు మృతదేహాలు నీటిపై తేలుతుండటాన్ని రెస్క్యూ టీమ్స్ గుర్తించి బయటికి తీసుకొచ్చాయి. ఈ ఇద్దరితో కలిసి మృతుల సంఖ్య 13కు పెరిగింది.
