- హార్మూజ్ జలసంధిపై స్పష్టం చేసిన ఇరాన్ ఆర్మీ..
- తేల్చి చెప్పిన ఆర్మీ ప్రతినిధి మహమ్మద్ ఆక్రమినియా..
హర్మూజ్ జలసంధిపై తమకు పూర్తి నియంత్రణ ఉందని, తమ అనుమతి లేకుండా మిత్రదేశాలు, శత్రు దేశాలకు చెందిన ఏ ఒక్క నౌక కూడా ఆ మార్గం గుండా ప్రయాణించలేదని ఇరాన్ ఆర్మీ స్పష్టంచేసింది. హర్మూజ్ జలసంధిని నియంత్రించడం తమకు ఉన్న సహజమైన హక్కు అని ఇరాన్ ఆర్మీ ప్రతినిధి మహమ్మద్ అక్రమినియా అన్నారు. ప్రస్తుతం ఇరాన్ ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్’.. దేశ సైన్యం సంయుక్తంగా హర్మూజ్ జలసంధిని పూర్తిస్థాయిలో నియంత్రిస్తున్నాయని మహ్మద్ అక్రమానియా తెలిపారు.
తమ బలగాల అనుమతి లేకుండా ఏ నౌకకూ ప్రయాణించే హక్కు లేదని అక్రమానియా తేల్చిచెప్పారు. మరోవైపు తమ నౌకలను అనుమతించాలంటూ వివిధ దేశాలు టెలెక్స్, లేఖల ద్వారా ఇరాన్‌ను అత్యవసరంగా అభ్యర్థిస్తున్నాయని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి హమీద్ ఘన్‌బారీ చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్ హర్మూజ్ జలసంధిపై తన పట్టును బిగించింది. తమ భూభాగంపై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేసిన నేపథ్యంలో ఆ రెండు దేశాలకు చెందిన, వాటితో సంబంధం ఉన్న నౌకలపై ఇరాన్ నిషేధం విధించింది.
