- విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకున్న భార్య సంగీత..
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ వ్యక్తిగత జీవితంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన భార్య సంగీత తాను దాఖలు చేసిన విడాకుల పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. దీంతో గత కొన్ని నెలలుగా చర్చనీయాంశంగా మారిన ఈ వ్యవహారానికి తాత్కాలికంగా తెరపడింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో చెంగల్పట్టు కోర్టును ఆశ్రయించిన సంగీత, తమ దాంపత్య బంధాన్ని రద్దు చేయాలని కోరారు. ఇద్దరి మధ్య విభేదాలు సర్దుబాటు అయ్యే పరిస్థితి లేదని పిటిషన్లో పేర్కొన్నారు. భరణం ఇవ్వాలని, చెన్నైలోని నీలంకరై నివాసంలో ఉండేందుకు అనుమతి కల్పించాలని కూడా విజ్ఞప్తి చేశారు. విడాకుల కేసు విచారణ ఈ ఏడాది పలుసార్లు వాయిదా పడింది. గత నెల జరిగిన విచారణకు విజయ్, సంగీత ఇద్దరూ హాజరుకాలేదు. వారి తరఫు న్యాయవాదులు మాత్రమే కోర్టుకు హాజరై వ్యక్తిగత కారణాలతో రాలేకపోయినట్లు తెలిపారు. అనంతరం విచారణను ఆగస్టు 7కు వాయిదా వేశారు.
తాజా విచారణ సందర్భంగా సంగీత తన విడాకుల పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. ఆమె నిర్ణయానికి గల కారణాలపై మాత్రం ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడికాలేదు. సంగీత వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న కోర్టు, పిటిషన్ను ఉపసంహరించుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ కేసును “విత్డ్రాన్”గా పరిగణిస్తూ మూసివేస్తున్నట్లు (డిస్పోజ్) ప్రకటించింది. సంగీత నిర్ణయంపై విజయ్ తరఫు న్యాయవాది ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. భవిష్యత్తులో అవసరమైతే మళ్లీ కొత్త పిటిషన్ దాఖలు చేసుకునేందుకు సంగీతకు కోర్టు స్వేచ్ఛనిచ్చింది.
