- విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి..
సమాజ అభివృద్ధికి విద్యే ప్రధాన సాధనమని, ప్రభుత్వ పాఠశాలలను పూర్తి సౌకర్యాలతో నిర్వహించినప్పుడే ఉత్తమ సమాజం నిర్మాణం సాధ్యమవుతుందని తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి పేర్కొన్నారు.గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామంలో గ్రామ విద్యాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక మేళా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులందరికీ ఉచితంగా నాణ్యమైన విద్య అందించేందుకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రజల అభివృద్ధి కార్యాచరణలో విద్యకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. పాఠశాలల్లో తగిన తరగతి గదులు, సరిపడా ఉపాధ్యాయులు, గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, ఆటస్థలాలు వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటేనే విద్యార్థుల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో ప్రజా గాయని విమలక్క, పోటు రంగారావు, అంబటి నాగయ్య, పోటు రామారావు, మేదరమట్ల వెంకటేశ్వరరావు, మేకల నాగేశ్వరరావు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
