- రూ.లక్షలతో నూతన రోడ్డు నిర్మాణం…
- ఆర్ అండ్ బి రోడ్డు మంజూరుతో మరల అదే దారిని తవ్వి వదిలేసిన అధికారులు…
- బురద దారిలో ప్రయాణికుల అవస్థలు…
- కాంట్రాక్టర్ కోసం ఎదురు చూపులు…
పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం నిజమైన అభివృద్ధి సాధిస్తుందని దీని ఉద్దేశ్యం. అలాంటిది గ్రామాల అభివృద్ధికి ప్రాముఖ్యమైన రహదారి నిర్మాణంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో అటుగా వెళ్ళే వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేక గతంలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిధులు మంజూరు చేసి రోడ్డు నిర్మించింది. అయితే అదే రహదారిని మరో రహదారి నిర్మాణం పేరుతో అభివృద్ధి పనులు అంటూ తవ్వేసి నెలల తరబడి పనులు చేపట్టక వదిలేయడంతో ప్రజలు తీవ్ర ఇకట్లు పడుతున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే… మండల పరిధిలోని అల్లీపురం–భీల్యా నాయక్ తండా గ్రామాలకు వెళ్లాలంటే గతంలో సరైన రహదారి లేక ఈ మార్గంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు.ముఖ్యంగా వర్షాకాలంలో రహదారి బురదమయంగా మారడంతో ఆ దారి గుండా వెళ్ళే గ్రామస్తులు, రైతులు, విద్యార్థులు, మహిళలు నరకయాతన అనుభవించేవారని స్థానికులు చెబుతున్నారు. గ్రామీణ ప్రజలకు సరైన రహదారి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం సీఆర్ఆర్ 2024–25 నిధుల కింద రూ.69 లక్షల అంచనా వ్యయంతో రహదారి నిర్మాణం చేపట్టారు.ఇందుకు సంబంధించిన వివరాలను రహదారి వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకంలోనూ పొందుపరిచారు.
కొత్తగా నిర్మించిన రోడ్డునే మళ్లీ తవ్వేశారు..
అంతవరకు బాగానే ఉన్న కొంతకాలం తర్వాత ఇదే మార్గంలో నూతన ఆర్అండ్బీ రహదారి నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో ఇప్పటికే ఉన్న రహదారిని కొంత మేర తవ్వారు. కొత్త రహదారి నిర్మాణంతో తమ కష్టాలు శాశ్వతంగా తీరుతాయని గ్రామస్తులు భావించారు.అయితే రహదారిని తవ్విన అనంతరం పనులు నత్తనడకన కొనసాగుతుండటంతో ఆ దారిలో ప్రయాణం చేయలేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.ఈ సందర్భంగా స్థానికులు మీడియాతో మాట్లాడుతూ కొత్తగా నిర్మించిన రహదారి తవ్వి రెండు నుంచి నాలుగు నెలలు గడుస్తున్నా పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదని తెలిపారు.దీంతో గతంలో రహదారి సౌకర్యం లేక ప్రజలు పడిన ఇబ్బందులే ప్రస్తుతం మళ్లీ ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బురదలోనే ప్రయాణికుల రాకపోకలు…
ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో తవ్విన రహదారి మొత్తం బురదమయంగా మారింది.సుమారు రెండు నుంచి మూడు కిలోమీటర్ల మేర బురదలోనే ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొందని స్థానికులు తెలిపారు.ద్విచక్ర వాహనదారులు, విద్యార్థులు,మహిళలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వర్షపు నీరు తవ్విన ప్రాంతాల్లో నిలిచి రహదారి మరింత అధ్వానంగా మారిందని,రహదారి అంచుల వద్ద ఇరువైపుల మట్టి కట్టలు వేయడంతో నీరు ప్రవహించే సరైన మార్గం లేక బురద పేరుకుపోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతులకు తప్పని తిప్పలు..
ఈ రహదారి వ్యవసాయ పొలాలకు వెళ్లే ప్రధాన మార్గం కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.రహదారి నిర్మాణం ఎత్తుగా ఉండటంతో పొలాల్లోకి ట్రాక్టర్లు,ఇతర వ్యవసాయ వాహనాలను తీసుకెళ్లడం కష్టంగా మారిందని రైతులు చెబుతున్నారు.కొన్ని చోట్ల రహదారి ఎత్తు,పక్కనున్న ప్రాంతం లోతుగా ఉండటంతో ట్రాక్టర్లు అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న సమయంలో రహదారి పరిస్థితి ఇలా ఉండటంతో రైతులకు తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉందని అంటున్నారు.
కొత్త రోడ్డు తవ్వారు.. వెళ్లిపోయారు..
కాంట్రాక్టర్ కొత్త రహదారి నిర్మాణం కోసం వేసిన నూతన రోడ్డును తవ్వి మరల రోడ్డు నిర్మాణానికి ముందుకు రాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రజల కోసం ఇప్పటికే నిర్మించిన రహదారిని నూతన రహదారి నిర్మాణం పేరుతో తవ్వే సమయంలో పనులను ఎప్పటిలోగా పూర్తి చేస్తారనే విషయాన్ని అధికారులు ఎందుకు స్పష్టంగా చెప్పలేదని ప్రశ్నిస్తున్నారు.రహదారి తవ్విన తర్వాత పనులు నిలిచిపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో వాహనాలు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని,అనారోగ్యంతో ఉన్నవారిని ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో కూడా అవస్థలు తప్పడం లేదని స్థానికులు చెబుతున్నారు.
మొరపెట్టుకున్నా స్పందించని అధికారులు…
రహదారి దుస్థితిపై సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు స్థానికులు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ కనీస స్పందన కరువైందని ఆరోపిస్తున్నారు.ఉన్నతాధికారులకు సైతం సమాచారం అందించినా సమస్య పరిష్కారానికి చర్యలు కనిపించడం లేదని స్థానికులు వాపోతున్నారు.
స్థానికులకు సమాధానం చెప్పేదే ఎవరు?
రహదారి పనులు ఎందుకు నిలిచిపోయాయి?కాంట్రాక్టర్ పనులు ఎందుకు ప్రారంభించడం లేదు?పనులు పూర్తయ్యే గడువు ఎంత? ఇప్పటివరకు జరిగిన రహదారి నిర్మాణం పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నలకు సంబంధిత శాఖ అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ఆర్అండ్బీ శాఖ పర్యవేక్షణపై తలెత్తుతున్న ప్రశ్నలు..
ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారి సౌకర్యం కల్పించేందుకు నిధులు కేటాయిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం రహదారులను తవ్వి నెలల తరబడి పనులు చేపట్టకపోవడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.కాంట్రాక్టర్ పనులు ఆలస్యం చేస్తుంటే సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.పనుల పురోగతిని పర్యవేక్షించాల్సిన అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలిస్తున్నారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆమడ దూరంలో అభివృద్ధి లక్ష్యాలు..
నియోజకవర్గంలోని గ్రామాలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నప్పటికీ, అల్లీపురం–భీల్యా నాయక్ తండా రహదారిపై నెలకొన్న పరిస్థితులు ఆ లక్ష్యానికి ఆమడ దూరంలో ఉన్నాయని స్థానికులు పేర్కొన్నారు.
రహదారి నిర్మాణం త్వరగా చేపట్టాలి
ప్రజల కోసం నిర్మించిన నూతన రోడ్డును కొత్తగా మంజూరు అయిన ఆర్ అండ్ బి రోడ్డు కోసం తవ్వడంతో నూతన రహదారి నిర్మాణ పనులు ముందుకు సాగటం లేదు.వర్షం పడితే బురద,ఎండ వస్తే దుమ్ముతో ప్రజలకు మాత్రం అవస్థలే అంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా నిర్మాణం నిలిచిన రహదారి పనులను వెంటనే ప్రారంభించాలని, ఈ వ్యవహారంపై ఆర్అండ్బీ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి రహదారి పనులు ఎందుకు నిలిచిపోయాయో సమగ్రంగా పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు.
సంబంధిత కాంట్రాక్టర్ వివరాలు, పనుల పురోగతి,పనులు పూర్తి చేయాల్సిన గడువు తదితర అంశాలను పరిశీలించి,రహదారి నిర్మాణంలో నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.అదే విధంగా రహదారి నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అల్లీపురం,భీల్యా నాయక్ తండా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.ప్రభుత్వం అభివృద్ధి కోసం ఓ పక్క నిధులు కేటాయిస్తున్నా ప్రజలు మాత్రం రహదారి కోసం బురదలో నడవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో సంబంధిత అధికారులు సమాధానం చెప్పాలని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.ఇకనైనా అధికారులు స్పందించి సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
