- ప్రజాస్వామ్య రక్షణలో జాగరుకతతో ఉంటాం… కాపాడుకుంటాం…
- సింగరేణి సంస్థ – తెలంగాణ ప్రజల ఆస్తి
- రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికుల సంక్షేమంలో రాజీపడేది లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో వైద్య పరంగా పనిచేయలేని సింగరేణి ఉద్యోగుల కుటుంబ సభ్యులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి రాష్ట్ర ఐ.టి., ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, రాష్ట్ర షెడ్యూల్ తెగలు, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అల్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర రవాణా, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ, శాసనమండలి సభ్యులు దండే విఠల్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల, బెల్లంపల్లి, భూపాలపల్లి, వైరా నియోజకవర్గాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వినోద్, సత్యనారాయణ, మలోత్ రాందాస్ నాయక్, సింగరేణి కార్మిక సంఘాల ప్రతినిధులు వాసిరెడ్డి సీతారామయ్య, జనక్ ప్రసాద్, ప్రజా ప్రతినిధులతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సంక్షేమంలో రాజీపడేది లేదని, సింగరేణి సంస్థ తెలంగాణ ప్రజల ఆస్తి అని, ప్రజాస్వామ్య రక్షణలో జాగరుకతతో ఉంటామని తెలిపారు.
మంచిర్యాల జిల్లాలో గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ పునరుద్ధరణ కొరకు 70 కోట్ల రూపాయలు, మినీ లిఫ్ట్ ఇరిగేషన్ కొరకు 74 కోట్ల 40 లక్షల రూపాయలతో పాటు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. వైద్యపరంగా పనిచేయలేని సింగరేణి ఉద్యోగులకు సంబంధించిన 335 మంది అర్హత గల అభ్యర్థులకు నియామక పత్రాలు అందించడం జరుగుతుందని, భవిష్యత్తులో మరింత మంది అర్హులకు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సింగరేణి సంస్థను కాపాడుకుందాం అని, తెలంగాణ ఆస్తిగా తీర్చిదిద్దుదామని తెలిపారు.

సింగరేణి కార్మికులకు 1 కోటి 25 లక్షల బీమా అందించడం జరుగుతుందని, 30 వేల మంది ఒప్పంద/పొరుగు సేవల సిబ్బందికి బోనస్ అందించామని తెలిపారు. కోల్ బ్లాక్స్ లలో పూర్తి నిఘా వ్యవస్థ మధ్యలో పని జరుగుతుందని, తెలంగాణ వనరులను కాపాడతామని తెలిపారు. కోల్ బెల్ట్ ప్రాంతంలోని శాసనసభ్యులతో మాట్లాడి కార్మిక సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం, సింగరేణి సంస్థ సమన్వయంతో సింగరేణి బొగ్గు గనులను మరింత అభివృద్ధి చేసి కార్మికుల సంక్షేమం దిశగా కృషి చేస్తామని తెలిపారు.
రాష్ట్ర ఐ. టి. శాఖ మంత్రి మాట్లాడుతూ సింగరేణి సంస్థను, తెలంగాణ నల్ల బంగారం బొగ్గును కాపాడుకుందాం అని, కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మెడికల్ అన్ ఫిట్ విషయంలో పారదర్శకంగా ముందుకు వెళదామని తెలిపారు. సింగరేణి కార్మికులకు 1 కోటి 25 లక్షల రూపాయలతో పాటు ఒప్పంద/పొరుగు సేవల సిబ్బందికి 40 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు. సింగరేణి సంస్థ లాభాలలో సింగరేణి కార్మికులతో పాటు ఒప్పంద కార్మికులకు లాభాల వాటా అందించడం జరిగిందని తెలిపారు.
మంచిర్యాల శాసనసభ్యులు మాట్లాడుతూ నియామక పత్రాలు అందుకున్న 335 మందిలో 117 మంది మంచిర్యాల జిల్లాకు చెందిన వారు కావడం సంతోషంగా ఉందని తెలిపారు. సింగరేణి సంస్థలో మారుపేరు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, ఒక కమిటీని నియమించి పర్యవేక్షించడం జరుగుతుందని, బాధితులకు తప్పనిసరిగా న్యాయం చేస్తామని తెలిపారు.

ప్రభుత్వం కార్మికుల పక్షాన ఉంటుందని, పదవీ విరమణ పొందిన సింగరేణి కార్మికులకు తెల్ల రేషన్ కార్డులు అందించడం జరిగిందని తెలిపారు. రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగులు అందిస్తున్న కార్మికుల శ్రేయస్సుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు.
సింగరేణి ప్రాంతాలలో ఖాళీగా ఉన్న క్వార్టర్లను పదవీ విరమణ పొందిన కార్మికులకు అందించి ఇందిరమ్మ ఇండ్ల పథకం వర్తింప చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్నులు వెసలుబాటు కల్పించాలని, జిల్లాలోని మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో గల శ్రీరాంపూర్ ప్రాంతంలో అర్హులకు పట్టాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
బెల్లంపల్లి శాసనసభ్యులు మాట్లాడుతూ 1992లో సింగరేణి సంస్థను 450 కోట్ల రూపాయలకు బి ఐ ఎఫ్ ఆర్ క్రిందకు పంపించడాన్ని ఆనాడు గడ్డం వెంకటస్వామి అడ్డుకొని కాపాడారని గుర్తు చేశారు. కార్మికులకు సింగరేణి లాభాలలో వాటా ఇప్పించడం జరిగిందని తెలిపారు.
అనంతరం అర్హులైన సింగరేణి కార్మిక కుటుంబ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, సింగరేణి సంస్థ అధికారులు, సింగరేణి కార్మికులు పాల్గొన్నారు.
