- రాజాసాబ్ సినిమా టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం ఓకే..
- మంత్రి స్వయంగా పెంచబోము అని చెప్పిన మాట ఎలా తప్పుతారు..?
- మీ ఇష్టమొచ్చినట్లుగా ధరలు పెంచుతూ మెమోలు ఎలా ఇస్తారు..?
- ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన కోర్టు
కొత్త సినిమాల టికెట్ ధరలను పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ మెమోలు జారీ చేయడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలివిగా మెమోలు ఎందుకు ఇస్తున్నారని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. టికెట్ ధరలు పెంచబోమని సంబంధిత మంత్రే స్వయంగా ప్రకటించారని, అయినా కూడా ధరల పెంపునకు మెమోలు ఎందుకు ఇస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు విరీ ఆలోచన మారడం లేదంటూ మండిపడింది.. మెమో ఇచ్చే అధికారికి నిబంధనలు తెలియవా? అంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నించింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ది రాజా సాబ్’ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అధికారులు అనుమతించిన సంగతి తెలిసిందే.
గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం నుంచి ఈ నెల 11 వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.105, మల్టీప్లెక్స్ ల్లో రూ.132 పెంపునకు అనుమతి ఇచ్చిం ది. 12 నుంచి 18వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.62, మల్టీప్లెక్స్ ల్లో రూ.89 పెంపునకు అను మతి ఇచ్చింది. టికెట్ లాభాల్లో 20 శాతం ఫిలిం ఫెడరేషన్కు ఇవ్వాలని ఆదేశాలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నిబంధనలకు విరుద్ధంగా టికెట్ల ధరల పెంపునకు అనుమతిస్తున్నారని న్యాయవాది విజయ్ గోపాల్ పిటిషన్లో పేర్కొన్నారు. హెూంశాఖ కార్యదర్శికి మెమో జారీ చేసే అధికారం లేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, హైదరాబాద్లో సీపీ మాత్రమే టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని కోర్టుకు వివరించారు.
