తెలంగాణ రాష్ట్రం(Telangana State)లో కాంగ్రెస్ పార్టీ పాలన(Congress Party Government)కు రెండేళ్లు నిండింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. అందులోని అంశాలు.. జాతి కోసం, జనహితం కోసం, గొప్ప కలలు కనాలంటే ధైర్యం ఉండాలి. గొప్ప కార్యాలు చేయాలంటే… మహా సంకల్పం కావాలి… సరిగ్గా రెండేళ్ల క్రితం నాకు ఆ ధైర్యం ఇచ్చి… తమ ఓటుతో గెలుపు సంకల్పాన్ని ఇచ్చి… నిండు మనసుతో ఆశీర్వదించిన తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు(Thanks to People). ఈ రెండేళ్ల ప్రస్థానంలో… నిత్యం అహర్నిశలూ అవని పై తెలంగాణను శిఖరాగ్రాన నిలిపేందుకు తపనతో శ్రమించాను.
గత పాలన శిథిలాల కింద కొనఊపిరితో ఉన్న నవతరానికి కొలువుల జాతరతో కొత్త ఊపిరి పోశాం. రుణభారంతో వెన్ను విరిగిన రైతుకు దన్నుగా నిలిచి దేశానికే ఆదర్శంగా నిలిపాం. ఆడబిడ్డల ఆకాంక్షలకు ఆర్థిక మద్ధతు ఇచ్చి అదానీ, అంబానీల లెక్క వ్యాపారరంగంలో నిలిపాం. బలహీనవర్గాల వందేళ్ల ఆకాంక్షలను కుల లెక్కలతో కొత్త మలుపులు తిప్పాం. వర్గీకరణతో మాదిగ సోదరుల ఉద్యమానికి నిజమైన సార్థకత చేశాం. చదువొక్కటే బతుకు తెరువుకు బ్రహ్మాస్త్రం అని నమ్మి… యంగ్ ఇండియా (Young India) ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల నిర్మాణ యజ్ఞానికి పునాదులు వేశాం. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టాం. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వం మూల సిద్దాంతంగా ముందుకు సాగుతున్నాం.
“జయ జయహే తెలంగాణ” (Jaya Jaya Telangana) అన్న ప్రజాకవి అందెశ్రీ గేయానికి, జన ఆకాంక్షల మేరకు అధికారిక గుర్తింపు ఇచ్చాం. సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆడబిడ్డలకు ఉచిత బస్సు పథకం, రూ.500 కే గ్యాస్, సన్న ధాన్యానికి రూ.500 బోనస్, కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే గొప్ప పథకాలన్నీ ఈ రెండేళ్ల సంక్షేమ చరిత్రకు సాక్ష్యాలు. నేటి అవసరాలు తీర్చి, పేదల సంక్షేమం కూర్చి ఇదే అద్భుతం అని మేం సరిపెట్ట లేదు.
స్వతంత్ర భారత ప్రయాణం వందేళ్ల మైలురాయికి చేరే సందర్భం 2047 నాటికి మన తెలంగాణ ఎట్లుండాలి… ఎక్కడ ఉండాలో లోతైన మథనంతో మార్గదర్శక పత్రం సిద్ధం చేశాం.భారత్ ఫ్యూచర్ సిటీ రేపటి తెలంగాణ ప్రగతికి వేగుచుక్క. నిన్నటి వరకు ఒక లెక్క… రేపటి “తెలంగాణ గ్లోబల్ సమ్మిట్” తర్వాత మరో లెక్క. నిన్న, నేడు, రేపు… మీ ఆశీర్వాదమే నా ఆయుధం. మీ ప్రేమాభిమానాలే నాకు సర్వం… మీ సహకారమే నాకు సమస్తం. అందరికి ప్రజా పాలన రెండేళ్ల విజయోత్సవ శుభాకాంక్షలు.
