మనస్తాపంతో కార్మికుడు ఆ*త్మహ*త్య చేసుకున్న సంఘటన నందిగామ మండల పరిధిలోని రంగాపూర్ గ్రామ శివారులో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఒంగోలు జిల్లా, సింగరాయకొండకు చెందిన కిషోర్ (24), కొత్తూరు మండల కేంద్రంలోని నాట్కో ఫార్మా లిమిటెడ్ పరిశ్రమలో పని చేస్తూ, నందిగామ మండల పరిధిలోని రంగాపూర్ గ్రామంలో తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు.
గత వారం నాట్కో పరిశ్రమలో కిషోర్ విధులు నిర్వహిస్తూ పడుకున్నాడనే అక్కసుతో పరిశ్రమ ప్రతినిధులు నిత్యం డ్యూటీ సమయాలు మారుస్తూ ఇబ్బందులకు గురి చేశారని, అందుకోసమే తీవ్ర మనస్తాపానికి గురైన కిషోర్ రంగపూర్ శివారులోని మెట్రో సిటీ వెంచరులో చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడని తెలిపారు.
తోటి కార్మికులు, మృతుని కుటుంబ సభ్యులు నాట్కో పరిశ్రమ ముందు కిషోర్ మృతదేహంతో ధర్నాకు దిగారు.పోలీసులు జోక్యం చేసుకుని పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడి కార్మికుడి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. పోస్టుమార్టం నిమ్మితం షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని పేర్కొన్నారు.మృతుడు తండ్రి కృష్ణారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ ప్రసాద్ తెలిపారు.
