Homeమహబూబ్‌నగర్‌Transport | ఆమనగల్‌-మాల్‌ బస్సు పునఃప్రారంభం.. గ్రామాల ప్రజలకు ఊరట

Transport | ఆమనగల్‌-మాల్‌ బస్సు పునఃప్రారంభం.. గ్రామాల ప్రజలకు ఊరట

  • ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చొరవతో బస్సు పునరుద్ధరణ
  • సరికొండ సర్పంచ్ అద్దాల మహేందర్ గౌడ్

కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చొరవతో రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం సరికొండ,బోయినగుట్ట తండా పరిసర గ్రామాల ప్రజల ఎన్నో ఏళ్ల నాటి బస్సు సమస్యకు పరిష్కారం లభించింది. కల్వకుర్తి డిపో నుంచి ఆమనగల్‌–మాల్‌ మార్గంలో బస్సు సౌకర్యాన్ని తిరిగి పునరుద్ధరించారు.

దీంతో ఆయా గ్రామాల ప్రజలు,విద్యార్థులు, ఉద్యోగులు,వ్యాపారులు, దినసరి కూలీలు మాల్‌ పట్టణానికి రాకపోకలు సాగించేందుకు వెసులుబాటు కలిగింది. ఆమనగల్‌ నుంచి ఆకుతోటపల్లి, ముద్విన్‌,బోయినగుట్ట తండా, సరికొండ, పల్లెచెల్క తండా, మేడిపల్లి, తక్కెళ్లపల్లి మీదుగా మాల్‌ పట్టణానికి బస్సు రాకపోకలు కొనసాగనున్నాయి. ముఖ్యంగా బోయినగుట్ట తండాకు తొలిసారిగా బస్సు సౌకర్యం కల్పించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా సరికొండ గ్రామ సర్పంచ్‌ పాలకూర అద్దాల మహేందర్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. గ్రామాల ప్రజల ఇబ్బందులను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి బస్సు సౌకర్యం పునరుద్ధరణకు కృషి చేసినట్లు తెలిపారు.బోయినగుట్ట తండాకు చరిత్రలో తొలిసారిగా బస్సు సౌకర్యం కల్పించిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి,రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌,ఎంపీ మల్లు రవి,కల్వకుర్తి డిపో మేనేజర్‌కు గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

ఆకుతోటపల్లి,శెట్టిపల్లి,గౌరారం,ముద్విన్‌,బోయినగుట్ట తండా,సరికొండ,పల్లెచెల్క తండా,మేడిపల్లి తదితర గ్రామాల ప్రజలు మాల్‌ పట్టణానికి వెళ్లేందుకు సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు తెలిపారు.ఈ సమస్యను మాజీ జెడ్పీటీసీలు,ఎంపీటీసీలు, ఉపసర్పంచ్‌లు,గ్రామ నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా,వెంటనే స్పందించి బస్సు సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ బస్సు సౌకర్యాన్ని ఆయా గ్రామాల విద్యార్థులు, యువత, ఉద్యోగులు, వ్యాపారులు, దినసరి కూలీలు,రైతులు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ నాయకులు కోరారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ అద్దాల మహేందర్‌ గౌడ్,ఉపసర్పంచ్‌ బలవంత్‌,వార్డు సభ్యులు బాలమణి నరసింహ,మంజుల శ్రీను,కాంటేకర్‌ శ్రీను,వెంకటయ్య,మాజీ సర్పంచ్‌ కొత్తపెళ్లి యాదమ్మ,పార్టీ అధ్యక్షులు రౌతు వెంకటయ్య, అద్దాల యాదయ్య, లక్ష్మయ్య, యాదయ్య ఆలంపల్లి, వెంకటయ్య, మహేష్‌, హరిచంద్ర, నరసింహ, జయారి, రాములు తదితరులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News