- సంచలన నిర్ణయం తీసుకున్న ఫోక్స్ వ్యాగన్..
- ఉద్యోగాలు కోల్పోనున్న లక్షమంది ఉద్యోగులు..
బహుళజాతి ఆటో రంగ దిగ్గజం, జర్మనీకి చెందిన సంస్థ ఫోక్స్‌వ్యాగన్.. భారీగా ఉద్యోగులను తొలగించనున్నది. జర్మనీ ప్లాంట్లలో నాల్గింటిని మూసేయాలని సంస్థ యోచిస్తున్నది. ఈ క్రమంలోనే మొత్తంగా లక్ష మంది ఉద్యోగాలను కోల్పోవచ్చని శుక్రవారం సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ సూపర్‌వైజరీ బోర్డు సభ్యులు ఇందుకు సంబంధించిన ప్రణాళికల్ని వేసినట్టు తెలుస్తుండగా.. గ్రూప్ మేనేజ్‌మెంట్ బోర్డు చైర్మన్ ఒలీవర్ బ్లమ్ ఆయా అనుబంధ సంస్థల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు గత వారమే ఉద్యోగుల తొలగింపునకు అమలుపర్చే ప్లాన్లను వివరించినట్టు తెలియవస్తున్నది.
జూలై 9న జరిగే సమావేశంలో దీనిపై చర్చించనున్నట్టు సమాచారం. అయితే ఈ ఉద్యోగ కోతలపట్ల కార్మిక సంఘాలతోపాటు, కంపెనీలో పెద్ద ఎత్తున వాటా ఉన్న లోయర్ సాక్సోనీ రాష్ట్ర ప్రభుత్వ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలున్నాయని చెప్తున్నారు. మరోవైపు కంపెనీ వర్గాలు ఈ విషయంపై మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు. కాగా, హానోవర్, జ్వికావు, ఎమ్డెన్ ప్లాంట్లను మూసేయాలని చూస్తున్న ఫోక్స్‌వేగన్..
తమ అనుబంధ లగ్జరీ కార్ల బ్రాండ్ ఆడీకి చెందిన నెకర్సమ్ సైట్ కార్యకలాపాలనూ ఆపేయాలని భావిస్తున్నది. ఈ ప్లాంట్లలో 45,000కుపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. దీంతో వీరందరి కొలువులు ప్రమాదంలో పడ్డాయి. ఇక 2024 చివర్లో కార్మిక సంఘాలతో కుదిరిన ఒప్పందం మేరకు అన్నిచోట్ల మరో 50,000 ఉద్యోగులను సంస్థ తీసేయనున్నది. ఫలితంగా మొత్తం లక్ష మంది ఉద్యోగులు రోడ్డునపడనున్నారు.
