- ఇది తొందరపాటు అవుతుంది..
- వెల్లడించిన ఆర్.బీ.ఐ. గవర్నర్..
యూపీఐ లావాదేవీలపై ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధించే అంశంపై ఇప్పుడే నిర్ణయానికి రావడం తొందరపాటవుతుందని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను బలోపేతం చేయాలంటే దాని నిర్వహణ వ్యయాన్ని ఎవరో ఒకరు భరించాల్సిందేనని, అయితే ఆ భారం నేరుగా సాధారణ వినియోగదారులపైనే పడుతుందని ఇప్పుడే చెప్పలేమని తెలిపారు.
ద్రవ్య విధాన సమీక్ష అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మల్హోత్రా మాట్లాడుతూ.. యూపీఐపై ఎండీఆర్ అంశం ఇంకా ప్రారంభ దశలోనే ఉందన్నారు. ప్రభుత్వం చట్ట సవరణ ప్రక్రియలో ఉందని, తుది నిర్ణయం వచ్చే వరకు వేచి చూడాల్సిందేనని చెప్పారు. ‘‘వ్యవస్థ నిర్వహణకు ఖర్చు తప్పదు. ఆ ఖర్చును ఎవరో ఒకరు చెల్లించాల్సి ఉంటుంది. కానీ అది సాధారణ వినియోగదారుడే చెల్లిస్తాడని చెప్పలేం. పరోక్షంగా ఆర్థిక వ్యవస్థలోనే ఆ వ్యయం భరించే అవకాశం కూడా ఉంటుంది’’ అని మల్హోత్రా వివరించారు.
ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ‘పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్’ చట్ట సవరణ బిల్లు ద్వారా యూపీఐ, రూపే వంటి డిజిటల్ చెల్లింపులపై భవిష్యత్తులో ఎండీఆర్ విధించే అవకాశానికి చట్టపరమైన వెసులుబాటు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం నోటిఫై చేసిన డిజిటల్ చెల్లింపు విధానాలపై బ్యాంకులు లేదా చెల్లింపు సేవల సంస్థలు ఎండీఆర్ వసూలు చేయలేవు.
ప్రతిపాదిత సవరణ అమల్లోకి వస్తే ఏ చెల్లింపు విధానాలకు ఛార్జీలు ఉండాలి, వేటికి మినహాయింపు ఇవ్వాలి అనే విషయాన్ని ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా నిర్ణయించే అవకాశం ఉంటుంది. అయితే రోజువారీ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. రూ.2,000కు పైబడిన వ్యాపార చెల్లింపులపై మాత్రమే ఎండీఆర్ విధించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారని, పాలు, కూరగాయలు, కిరాణా వంటి చిన్న మొత్తాల యూపీఐ చెల్లింపులు యథాతథంగా ఉచితంగానే కొనసాగే అవకాశముందని తెలిపాయి.
