- తొలి ఎస్.యూ.వీ. సొరెంటో విడుదలకు సిద్ధం..
- ప్రారంభమైన ప్రీ బుకింగ్స్..
ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా, దేశీయ మార్కెట్‌లో హైబ్రిడ్ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. తన తొలి హైబ్రిడ్ మోడల్‌గా ప్రీమియం ఎస్‌యూవీ ‘సొరెంటో’ను తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేయడంతో పాటు, దేశవ్యాప్తంగా ప్రీ-బుకింగ్స్‌ను కూడా ప్రారంభించింది. ఆసక్తి ఉన్న కస్టమర్లు కియా డీలర్‌షిప్‌లలో లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ మూడు వరుసల సీటింగ్ కారును బుక్ చేసుకోవచ్చు. రాబోయే కొద్ది వారాల్లోనే దీనిని మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది.
కియా పోర్ట్‌ఫోలియోలో సెల్టోస్ కంటే పైన, ఒక విశాలమైన ఫ్యామిలీ వెహికల్‌గా సొరెంటో స్థానం సంపాదించుకోనుంది. సుమారు 4.8 మీటర్ల పొడవుతో ఉండే ఈ ఎస్‌యూవీ, చూడగానే ఆకట్టుకునేలా నిటారుగా ఉండే డిజైన్, వెడల్పైన బాడీ, రెండు-అంచెల ఫ్రంట్ లైటింగ్ సిగ్నేచర్, ఇల్యూమినేటెడ్ ఎల్ఈడీ గ్రాఫిక్ వంటి ప్రత్యేకతలతో వస్తోంది. ఈ డిజైన్ అంశాలను కంపెనీ విడుదల చేసిన టీజర్‌లో స్పష్టంగా చూపింది.
ప్రపంచవ్యాప్తంగా కియాకు అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లలో సొరెంటో ఒకటి. ఇప్పటివరకు 132 దేశాల్లో 48 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడై, గ్లోబల్ మార్కెట్‌లో తన సత్తా చాటింది. ముఖ్యంగా భద్రత విషయంలో దీనికి మంచి రికార్డు ఉంది. ఐఐహెచ్ఎస్ టాప్ సేఫ్టీ పిక్+, ఎన్‌హెచ్‌టీఎస్ఏ ఫైవ్-స్టార్ రేటింగ్‌లను సొంతం చేసుకుని ప్రయాణికులకు భరోసా ఇస్తోంది.
