- బీ.ఆర్.ఎస్. తప్పుడు ప్రచారం చేస్తోంది..
- ఇది సరికాదన్న టి. బీజేపీ చీఫ్ రామచంద్ర రావు..
- వ్యక్తిని లక్ష్యంగా చేసుకోవడం తప్పు..
కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ ఎలాంటి తప్పుచేయలేదని, కానీ ఆయనపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు. బండి సంజయ్, బీజేపీపై రాజకీయ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిని, కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. బండి సంజయ్ పైనా, బీజేపీపైనా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి బీఆర్ఎస్ రాష్ట్రమంతా పోస్టర్లు వేయించిందని విమర్శించారు. బండి సంజయ్ కుటుంబ సభ్యులు తప్పు చేస్తే న్యాయపరంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
కానీ బండి సంజయ్‌ని లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం చేయడమేమిటని ప్రశ్నించారు. బండి సంజయ్‌ని కేటీఆర్ లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ల కాలంలో మహిళలపై నేరాలు 67 శాతం పెరిగాయని ఆరోపించారు. మహిళలపై జరిగిన అత్యాచారానికి సంబంధించి కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేశారా అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ బాలిక కేసులో లేదా మద్యం కేసులో మహిళ జైలుకు వెళ్ళినప్పుడు లేదా తనను ఎమ్మెల్యే వేధిస్తున్నారని ఓ మహిళా సర్పంచ్ ఫిర్యాదు చేసినప్పుడు వారు రాజీనామా చేశారా అని నిలదీశారు.
