Saturday, July 4, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంNIMS | నిమ్స్ ఫార్మసీ టెండర్లలో మాయాజాలం..

NIMS | నిమ్స్ ఫార్మసీ టెండర్లలో మాయాజాలం..

  • ఒకే సంస్థ కోసం నాలుగు సార్లు రూల్స్ మార్పు?
  • జీపీ మెడికల్ స్టోర్, ఏజీ ఫార్మసీ భాగస్వామ్య సంస్థకు అన్ని అర్హతలు ఉన్నాయి..
  • షాలినీ మెడికల్స్ కు అనుకూలంగా చక్రం తిప్పిన నిమ్స్ అధికారులు..
  • హై కోర్టును ఆశ్రయించిన ఎస్. మోహిత్, మరో రెండు మెడికల్ స్టోర్స్..
  • డ్రగ్స్ లైసెన్స్ పై కూడా అనుమానం ఉన్నట్లు హై కోర్టు మెట్లెక్కిన భజరంగ్ అనే వ్యక్తి..
  • నిజా నిజాలు నిగ్గు తేల్చి న్యాయం చేయాలని కోరుతున్న బాధితులు..

పేదవాడి ప్రాణాలకు భరోసా ఇవ్వాల్సిన నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్).. ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. రోగాలను నయం చేయాల్సిన వైద్యాలయం, నిబంధనలను తుంగలో తొక్కి టెండర్ల అక్రమాలకు అడ్డాగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకరికి లాభం చేకూర్చడం కోసం వ్యవస్థలనే ఎలా మేనేజ్ చేస్తారో చెప్పడానికి నిమ్స్ ఫార్మసీ టెండర్ల వ్యవహారమే ఒక నిలువెత్తు నిదర్శనం. ఒక అర్హత లేని సంస్థకు ఎలాగైనా కాంట్రాక్ట్ కట్టబెట్టాలనే అధికారుల అత్యుత్సాహం ఏకంగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మెట్లు ఎక్కేలా చేసింది. నిమ్స్ అధికారుల ఏకపక్ష వైఖరిని సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించడంతో, ఈ టెండర్ల భాగోతం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.

రోగులకు ప్రాణదాతగా నిలవాల్సిన ప్రతిష్ఠాత్మక నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దవాఖానా, ఇప్పుడు టెండర్ల అక్రమాలకు అడ్డగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిమ్స్ ఫార్మసీ షాపుల కేటాయింపులో ఒక నిర్దిష్ట సంస్థకు లబ్ధి చేకూర్చేందుకు అధికారులు నిబంధనలను ఇష్టారాజ్యంగా మార్చేశారనే వ్యవహారం ఇప్పుడు హైకోర్టుకు చేరింది..

- Advertisement -

ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది..నిమ్స్ ఫార్మసీ షాపుల టెండర్లకు తొలుత 05-10-2023న నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో గత మూడు సంవత్సరాల సగటు టర్నోవర్ రూ.10 కోట్లు ఉండాలని, చార్టర్డ్ అకౌంటెంట్ ధ్రువీకరణ సమర్పించాలని, అలాగే ఎన్.ఎం.సి. గుర్తింపు పొందిన 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఫార్మసీ నిర్వహించిన అనుభవం తప్పనిసరి అని నిబంధనలు విధించారు.

ఈ అర్హతలన్నీ జీపీ మెడికల్ స్టోర్, ఏజీ ఫార్మసీ భాగస్వామ్య సంస్థకు చెందిన ఎస్. మోహిత్‌కు ఉన్నప్పటికీ, ఆయనకు టెండర్ దక్కకుండా ఉండేందుకు నిమ్స్ అధికారులు ప్రయత్నించి, షాలిని మెడికల్స్‌కు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే తొలి టెండర్‌ను రద్దు చేశారనే విమర్శలు ఉన్నాయి.2016 నుంచి నిమ్స్‌లో ఫార్మసీ నిర్వహిస్తున్న జీపీ మెడికల్ సంస్థ 2020లో కూడా టెండర్ దక్కించుకుంది. ఆ ఒప్పందం 07-10-2023తో ముగియగా, కొత్త టెండర్ పూర్తయ్యే వరకు కాలపరిమితిని పొడిగించారు.

ఈ సంస్థ సంవత్సరానికి సుమారు రూ.20 కోట్ల టర్నోవర్ నమోదు చేసినట్లు సమాచారం.అనంతరం 14-03-2024న రెండోసారి టెండర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో టర్నోవర్ అర్హతను రూ.10 కోట్ల నుంచి రూ.8 కోట్లకు తగ్గించడంతో పాటు, 1000 పడకల ఆస్పత్రి అనుభవాన్ని 500 పడకల ఆస్పత్రి అనుభవంగా సడలించారు. దీంతో ఒక్కో షాపుకు ఆరు బిడ్లు వచ్చినప్పటికీ టెండర్‌ను మళ్లీ రద్దు చేశారు. మూడో టెండర్‌లో కూడా అర్హతలను మార్చి టర్నోవర్ లెక్కించే కాలపరిమితిని సవరించారు.

అయినప్పటికీ ఒక్కో షాపుకు ఏడు బిడ్లు వచ్చినా, అందరూ సాంకేతికంగా అనర్హులని పేర్కొంటూ టెండర్‌ను మళ్లీ రద్దు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.16-08-2024న విడుదల చేసిన నాలుగో టెండర్‌లో మరోసారి కీలక మార్పులు చేశారు. ఒక సంవత్సరం అద్దె మొత్తాన్ని డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో డిపాజిట్ చేయాలనే నిబంధనను తొలగించి, జాతీయకృత బ్యాంకు గ్యారంటీ సమర్పిస్తే సరిపోతుందని పేర్కొన్నారు.

అలాగే టర్నోవర్ అర్హతను రూ.7 కోట్లకు తగ్గించడంతో పాటు, ఎన్.ఎం.సి. గుర్తింపు పొందిన ఆస్పత్రికి మూడు కిలోమీటర్ల పరిధిలో మూడు సంవత్సరాలుగా ఫార్మసీ నిర్వహించిన అనుభవం ఉంటే సరిపోతుందని కొత్త నిబంధన చేర్చారు.ఈ మార్పులన్నీ షాలిని మెడికల్స్‌కు అనుకూలంగా రూపొందించారని, ఆ సంస్థ టర్నోవర్ రూ.7.44 కోట్లు మాత్రమే ఉండటంతో దానికి తగ్గట్టుగానే నిబంధనలు రూపొందించారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై ఎస్. మోహిత్‌తో పాటు మరో రెండు మెడికల్ సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి.

ఎన్నికల కోడ్, తగిన స్పందన రాలేదనే కారణాలు చూపుతూ ఒక టెండర్‌ను, సాంకేతిక అర్హతలు లేవనే కారణాలతో మరో రెండు టెండర్లను రద్దు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసు డబ్ల్యు.పీ. నెంబర్ . 23734 ఆఫ్ 2024 గా విచారణలో ఉంది.ఇదిలా ఉండగా, భజరంగ్ అనే వ్యక్తి కూడా ఈ టెండర్ వ్యవహారంపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. డ్రగ్ లైసెన్స్ విషయంలో కూడా అనుమానాలు ఉన్నాయని ఆయన ఆరోపించినట్లు తెలుస్తోంది. కాగా, నిమ్స్‌లో గతంలో జరిగిన మెడికల్ ఎక్విప్‌మెంట్ కొనుగోళ్లలో కూడా అవకతవకలు జరిగినట్లు ఏసీబీ నమోదు చేసిన కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.

2015లో నమోదైన ఈ కేసులో అప్పటి డైరెక్టర్ డాక్టర్ ఏ. ధర్మరక్షక్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ డి. ముకుందరెడ్డి, ఫైనాన్స్ కంట్రోలర్ వి. శ్రీధర్‌తో పాటు గ్లోబల్ లైఫ్ సర్వీసెస్, షిల్లర్ హెల్త్‌కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలపై అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.ఆపరేషన్ థియేటర్ టేబుళ్లు, లైట్లు, వెంటిలేటర్ల కొనుగోళ్లలో టెండర్ నిబంధనలు ఉల్లంఘించి రూ.3 కోట్లకు పైగా ప్రభుత్వానికి నష్టం కలిగించారని ఏసీబీ విచారణలో తేలినట్లు ఆరోపణలు ఉన్నాయి.

కనిష్ఠ ధర కోట్ చేసిన సంస్థను పక్కనపెట్టి అధిక ధర చెప్పిన సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారని, టెక్నికల్ కమిటీ సమావేశం కూడా నిర్వహించలేదని, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలను పాటించకుండా తయారీ సంస్థల నుంచి నేరుగా కొనుగోలు చేయకుండా మధ్యవర్తుల ద్వారా కొనుగోళ్లు జరిపారని ఏసీబీ పేర్కొంది.

అయితే, ఈ టెండర్ వ్యవహారంలో నిమ్స్ అధికారులు లేదా షాలిని మెడికల్స్ ఆరోపణలను అంగీకరించినట్లు ఇప్పటివరకు అధికారిక సమాచారం లేదు. అసలు నిమ్స్ లో మెడికల్ షాపుల వ్యవహా రంలో అవినీతి ఏ మేరకు జరుగుతోంది..? దీనివెనుక ఎవరు చక్రం తిప్పుతున్నారు..? తదితర అంశాలపై పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తీసుకుని రానుంది

“ఆదాబ్ హైదరాబాద్”.. ‘మా అక్షరం అవినీతిపై అస్త్రం’..

- Advertisement -
RELATED ARTICLES

Latest News