Friday, November 14, 2025
ePaper
Homeసాహిత్యంKavula Vedika | కాప్రా మల్కాజిగిరి కవుల వేదిక అంతర్జాల సమావేశం

Kavula Vedika | కాప్రా మల్కాజిగిరి కవుల వేదిక అంతర్జాల సమావేశం

అంతర్జాలం(Online)లో కాప్రా మల్కాజిగిరి (Kapra Malkajgiri) కవుల (Poets) వేదిక 13వ సమావేశం (Meeting) ఆసాంతం అద్భుతంగా జరిగింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న అంతర్జాతీయ తెలుగు కవి (International Telugu Poet) డాక్టర్ పెరుగు రామక్రిష్ణ.. వచన కవిత్వ నిర్మాణ పద్ధతుల గురించి అరగంట సేపు చక్కని ప్రసంగం చేశారు. కుందుర్తి ఆంజనేయులు, శ్రీశ్రీ, శేషేంద్ర శర్మ మొదలగు కవుల కవితలను ఉదహరించారు. వచన కవితల ప్రాధమిక లక్షణాలైన స్వేచ్ఛాయుత నిర్మాణం, భావ ప్రవాహ ఆధారిత నిర్మాణం, దృశ్యమాన చిత్రాలతో ప్రదర్శనం, సామాజిక స్పృహ, భాషా సరళత గమ్యం గురించి సోదాహరణంగా వివరించారు.

సహస్ర గేయ రచయిత, సభాద్యక్షుడు మౌనశ్రీ మల్లిక్ మొదట కాప్రా వేదిక సాహితీమూర్తుల(Literary figures)ను ఆహ్వానించి చక్కని కార్యక్రమాలు చేస్తూ అందరినీ ఆకర్షిస్తుందన్నారు. ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలను పెక్కు చేయాలని ఆకాంక్ష్యను వ్యక్తపరిచారు. విశిష్ట అతిధి, విశ్రాంత అటవీ శాఖ అధికారి శ్రీ అంబటి లింగ క్రిష్ణారెడ్డి కవులు పదికాలాల పాటు ప్రజల నాలుకలలో నిలిచిపోయే కవితలను వ్రాయాలన్నారు. ప్రసిద్ధ కవుల పద్యాలను కొన్ని వినిపించి అందరినీ ఆకట్టుకున్నారు. కార్యక్రమ నిర్వాహకుడు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ వేదిక లక్ష్యాలను, నిర్వాహకులు తీసుకుంటున్న చర్యలను వివరించారు. తొలుత అతిధులను కవులను స్వాగతిస్తూ డాక్టర్ తులసి వెంకట రమణాచార్యులు ఆహ్వానం పలికారు.

తర్వాత కవిసమ్మేళన సామ్రాట్, కుసుమ ధర్మన్న కళాపీఠం అధ్యక్షురాలు డాక్టర్ రాధా కుసుమ చక్కగా కవిసమ్మేళనం నిర్వహించారు. మొదట కవి మంత్రిప్రగడ మార్కండేయులు మది తలపించిన వేళ అనే కవితను చక్కగా వినిపించారు. పి. పద్మావతి మెంథా తుఫాను – కన్నీటి సముద్రం పై ఓ కవితను, గూండ్ల నారాయణ పల్లెల్లో పదిలమైన గొప్పదనము కవితను, క్రిష్ణంసెట్టి సుబ్బారావు గారు వృధ్యాప్యంలో బాధలు కవితను, బుక్కపట్నం రమాదేవి ధైర్యపు చుక్క స్త్రీ అని, రామాయణం ప్రసాదరావు విశ్వాసి అనే కవితను, లలిత పంతులు ఓ చక్కని కవితను, కాసర్ల సరోజ మనసు పలికే మౌనగీతం కవితను, తాతపూడి సోమశేఖర శర్మ ఓ చిన్ని కవితను, ఇలపావులూరి రాజ్యలక్ష్మి పుస్తకంపై కవితను, కట్టా శ్యామలాదేవి తెలుగు భాషపై పద్యాలను వినిపించారు.

ముగ్ధ మాధవి స్త్రీ గడప కవితను, నక్కా శ్రీనివాస్ శతమానం భవతి కవితను, కాదంబరి క్రిష్ణ ప్రసాద్ నైతిక విలువలు పై కవితను, సుజాత కోకిల పరిమళమై అనే కవితను, రాజ్యలక్ష్మి శశిధర్ చాక్లెట్ కవితను, డాక్టర్ శాంతిశ్రీ మాతృదినోత్సవం కవితను, డాక్టర్ నిశ్చల పితృదేవోభవ కవితను, పాటిబండ్ల కవిత మెంథా వేటు కవితను, గుర్రం శ్రీధర్ కవి సృష్టి కవితను, మహేంద్ర రాజు అమానుషం కవితను, మార్గం క్రిష్ణమూర్తి బంధాలు అనుబంధాలు కవితను, శోభ దేశ్ పాండె కార్తీకమాస విశిష్టత కవితను, అనితారాణి మొక్క కవితను, పి.ధనమ్మ సమాజ రుగ్మతలు కవితను, రాధా కుసుమ లైను విజయకుమార్ సేవలపై కవితను వినిపించారు. పిమ్మట గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ నవ్వులులేని మోములెందుకు, నవ్వలేని నరులెందుకు, నవ్వులు దీపాలు పువ్వులు పొంకాలు, నవ్వులు ముఖాలకు ఆభరణాలు, రోజూ నవ్వుతూ కాలం గడుపు, నవ్వటం ఒక భోగం – నవ్వలేకపోవటం ఒక రోగం అని నవ్వుల చిట్టా విప్పి శ్రోతలను తీయని కంఠంతో అలరించారు.

చివరగా ధరణీ మహిళా శక్తి అధ్యక్షురాలు పి. ధనమ్మ కవితాత్మక వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. కార్యకమం చాలా బాగా జరిగిందని, కవితలన్నీ బాగున్నాయని కవులు, కవయిత్రులు సంతోషం వ్యక్తపరిచారు. నిర్వాహకులకు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News