- పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ వాహనం..
లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఫెరారి.. కొత్తగా పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. లూస్ అనే ఆ కారు ఖరీదు సుమారు ఆరున్నర లక్షల డాలర్లు. ఇటలీ బ్రాండ్ ఫెరారీ కంపెనీ తొలిసారి ఫైవ్ సీటర్ వాహనాన్ని తయారు చేసింది. లవ్‌ఫ్రమ్ ఏజెన్సీ సహకారంతో దీన్ని డిజైన్ చేశారు. సోషల్ మీడియాలో కొత్త ఎలక్ట్రిక్ ఫెరారీ కారుపై ప్రశంసలు కురుస్తున్నాయి. మాస్టర్‌క్లాస్ డిజైన్‌లో ఉన్నట్లు కొందరు పేర్కొన్నారు. అయితే ఎలక్ట్రిక్ కార్ల వ్యాపారంలో ప్రస్తుతం డిమాండ్ తక్కువగా ఉంది. దీంతో సూపర్ కార్లు తయారు చేసే లాంబోర్గిని, పోర్సే కంపెనీలు ప్రస్తుతం ఈవీ కార్లను అనుకున్నంత ఉత్పత్తి చేయడం లేదు.
చైనా బ్రాండ్ల నుంచి తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలోనూ లగ్జరీ కంపెనీలు ఈవీ కార్లను లాంచ్ చేయలేకపోతున్నాయి. లూస్ అంటే ఇటలీ భాషలో కాంతి అని, ఈ కారును డెవలప్ చేసేందుకు అయిదేళ్లు పట్టిందని ఫెరారీ సీఈవో బెనడెట్టో విగ్నా తెలిపారు. లూస్ ఎలక్ట్రిక్ కారు వీల్స్‌కు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయని, కేవలం 2.5 సెకన్లలో ఆ కారు 96 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని ఫెరారీ నిపుణులు చెబుతున్నారు. కారుకు సంబంధించిన అన్ని పరికరాలను ఇన్‌హౌజ్‌లోనే తయారీ చేసినట్లు చెప్పారు.
