- అడ్మిషన్ల సీజన్ లో విభేదాలు..
- ప్రవేశాలు తగ్గుతాయని ఆలోచన..
డిగ్రీ విద్య వివాదాలకు కేరాఫ్‌గా మారుతున్నది. అడ్మిషన్ల సీజన్‌లో కీలక వ్యక్తుల మధ్య విభేదాలు తలెత్తాయి. పరిస్థి తి చూస్తుంటే తెలంగాణ ఉన్నత విద్యామండలి వర్సెస్.. కళాశాల విద్యాశాఖ కమిషనరేట్ అన్నట్టుగా పరిస్థితులున్నాయి. ఫలితంగా డిగ్రీ ఫస్టియర్‌లో అడ్మిషన్లు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. 2026-27 విద్యాసంవత్సరంలో డిగ్రీలో కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని సర్కార్ ఆదేశించింది.
దీంతో కళాశాల విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి వేర్వేరుగా ప్రయత్నాలు ప్రారంభించాయి. కళాశాల విద్యాశాఖ అప్రెంటిస్‌షిప్ కోర్సులు(ఏఈడీపీ) ప్ర వేశపెట్టేందుకు ప్రయత్నించగా, ఉన్నత విద్యామండలి ఎమర్జింగ్ కోర్సుల పేరిట నాన్ అప్రెంటిస్‌షిప్ కోర్సులు ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేశాయి. 94 న్యాక్ గుర్తింపు పొందిన ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అప్రెంటిస్‌షిప్ కోర్సులను కళాశాల విద్యాశాఖ ప్రవేశపెట్టింది.
గతంలో 16 కోర్సులు ప్రవేశపెట్టగా, ఈ విద్యాసంవత్సరం 11 కోర్సులు ప్రవేశపెట్టింది. ఉన్నత విద్యామండలి ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో 11 నాన్ ఏఈడీపీ కోర్సులు ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపట్టింది. నాన్ ఏఈడీపీ కోర్సులను ఇంతవరకు దోస్త్‌లో చేర్చలేదు. ఇంతకాలం కోల్డ్ వార్‌కు దారితీయగా, తాజాగా సోమవారం వివాదం రోడ్డెక్కింది. ఒకరి వాదనను మరొకరు తప్పుబట్టడం.. ఇదే విషయంపై సర్కార్‌కు ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది.
