- ప్రముఖుల సంతకాలు ఫోర్జరీ.. ఉప్పల్‌లో కేటుగాళ్ల ముఠా అరెస్ట్
ఐపీఎల్ క్రేజ్‌ను పెట్టుబడిగా మార్చుకొని సులభంగా డబ్బు సంపాదించాలనుకున్న ఒక ముఠా గుట్టును ఉప్పల్ పోలీసులు రట్టు చేశారు. సామాన్య ప్రజలను బురిడీ కొట్టించడం మాత్రమే కాకుండా, ఏకంగా దేశంలోని అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తుల పేర్లను వాడుకొని అధికారులను మోసగించిన తీరు విస్తుగొలుపుతోంది.
వివరాల్లోకి వెళ్తే..
మే 3వ తేదీన ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వద్ద ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులకు, స్టేడియం పార్కింగ్ వద్ద టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నారనే సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన ఉప్పల్ ఎస్.ఐ. ఏ. మాధవరెడ్డి బృందం అక్కడ అనుమానాస్పదంగా ఉన్న ఒక మహీంద్రా థార్ వాహనాన్ని (AP-40BB-6768) తనిఖీ చేసింది. పోలీసుల విచారణలో నిందితులు చేసిన నేరం వెలుగులోకి వచ్చింది.
అత్యున్నత స్థాయి ఫోర్జరీ:
కేవలం బ్లాక్‌లో టికెట్లు అమ్మడం మాత్రమే కాకుండా, ఈ ముఠా పెద్ద స్కెచ్ వేసింది. గూగుల్ నుండి జడ్జీలు, మంత్రులు, గవర్నర్ల
అధికారిక లెటర్ హెడ్‌లను డౌన్‌లోడ్ చేసేవారు. వాటిపై ప్రముఖుల సంతకాలను ఫోర్జరీ చేసి, హైదరాబాద్, తమిళనాడు, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్లకు సమర్పించేవారు. అలా వీవీఐపీల కోటాలో ఖరీదైన ‘కాంప్లిమెంటరీ’ టికెట్లను పొంది, ఆ తర్వాత వాటిని అవసరమున్న వారికి అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
ముగ్గురి అరెస్ట్ – ముగ్గురు పరారీ:
ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న గట్టమనేని అశోక్, కంకనాల దినేష్ మరియు సింగమనేని వేణుమాధవ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు రియల్ ఎస్టేట్ వ్యాపారి కాగా, మిగిలిన ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగులు. వీరంతా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా పల్కూరు గ్రామానికి చెందిన వారు. కాగా చెన్నైకి చెందిన ఆశిష్, సెంథిల్, తాన్సిల్ అనే ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
స్వాధీనం చేసుకున్న వస్తువులు:
రూ. 1,10,000 విలువైన ఐపీఎల్ టికెట్లు (తలా రూ. 22 వేల విలువ గల 5 టికెట్లు). మహీంద్రా థార్ వాహనం. 5 మొబైల్ ఫోన్లు మరియు 5 ఫోర్జరీ చేసిన లెటర్ హెడ్‌లు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ఐపిఎస్ పర్యవేక్షణలో, ఉప్పల్ జోన్ డిసిపి సురేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో ఉప్పల్ పోలీసులు మరియు ఎస్.ఓ.టి బృందం ఈ కేటుగాళ్లను పట్టుకున్నారు. నిందితులను సోమవారం కోర్టులో హాజరుపరిచారు.
