Homeహైదరాబాద్‌Gandipet | గండిపేట కాండ్యూట్‌ మరమ్మతు పనులు ముమ్మరం

Gandipet | గండిపేట కాండ్యూట్‌ మరమ్మతు పనులు ముమ్మరం

  • నిర్ణీత గడువు కంటే ముందే పూర్తి చేసేందుకు జలమండలి చర్యలు

హైదరాబాద్: హైదరాబాద్ నగరానికి తాగునీటిని సరఫరా చేసే గండిపేట(Gandipet) (ఉస్మాన్‌సాగర్) కాండ్యూట్‌పై మరమ్మతు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన పురాతన రాతి నిర్మాణ కాండ్యూట్‌లో సబ్జా కాలనీ, టోలిచౌకి, మణికొండ ప్రాంతాల వద్ద ఏర్పడిన భారీ లీకేజీలను అరికట్టేందుకు జలమండలి అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు.

20 ఎంజీడీల సామర్థ్యం కలిగిన ఈ కాండ్యూట్‌పై నవంబర్ 3వ తేదీ ఉదయం 6 గంటల నుంచి నవంబర్ 4వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు 36 గంటల పాటు షట్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరమ్మతు పనులను నిర్ణీత గడువులోగా కాకుండా, వీలైనంత ముందుగానే పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.

- Advertisement -

ఈ పనుల పురోగతిపై జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. వందేళ్లకు పైగా పురాతనమైన కాండ్యూట్ కావడంతో మరమ్మతుల విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. తాత్కాలిక చర్యలకే పరిమితం కాకుండా, భవిష్యత్తులో లీకేజీలు పునరావృతం కాకుండా నాణ్యతా ప్రమాణాలతో శాశ్వత పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.

మరమ్మతుల కారణంగా నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన మేరకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందించాలని సూచించారు. ట్రాన్స్‌మిషన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సరఫరా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.

కాగా, హైదరాబాద్ నగరానికి వివిధ జలవనరుల నుంచి ప్రతిరోజూ సుమారు 560 ఎంజీడీల తాగునీరు సరఫరా అవుతోంది. ప్రస్తుత షట్‌డౌన్ కేవలం గండిపేటకు సంబంధించిన 20 ఎంజీడీల కాండ్యూట్‌కే పరిమితమని జలమండలి స్పష్టం చేసింది. కృష్ణా, గోదావరి, సింగూరు–మంజీరా తదితర జలవనరుల నుంచి నీటి సరఫరా యథావిధిగా కొనసాగుతుందని వెల్లడించింది.

మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రభావిత ప్రాంతాలకు సాధ్యమైనంత త్వరగా నీటి సరఫరాను పునరుద్ధరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జలమండలి తెలిపింది. అప్పటివరకు వినియోగదారులు అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News