Homeమహబూబ్‌నగర్‌Kadthal | కడ్తాల్‌ లో హైవే పై కాంగ్రెస్‌ నేతల హల్‌చల్‌

Kadthal | కడ్తాల్‌ లో హైవే పై కాంగ్రెస్‌ నేతల హల్‌చల్‌

  • ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని ప్రతిజ్ఞ చేయించిన ఎమ్మెల్యేనే.. రోడ్డుపై వాహనాలు ఆపడంతో విమర్శలు
  • జాతీయ రహదారిపై కార్యకర్తలతో ముచ్చట్లు..
  • వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించిన ప్రజాప్రతినిధులే రహదారి నిబంధనలను పట్టించుకోలేదంటూ కడ్తాల్‌లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.శనివారం కడ్తాల్‌లోని ఎస్‌ఎల్‌ఆర్‌ గార్డెన్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశానికి పలువురు కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నాయకులు,ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.సమావేశం అనంతరం తిరుగు ప్రయాణంలో కడ్తాల్‌ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపైనే వాహనాలను నిలిపి కార్యకర్తలను కలవడంతో కొంతసేపు హల్‌చల్‌ నెలకొంది.

కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహా పలువురు కాంగ్రెస్‌ నాయకులు,కార్యకర్తలు రహదారిపై నిలిచి పరస్పరం పలకరించుకోవడంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు స్థానికులు పేర్కొన్నారు.ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో అటుగా ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు.

- Advertisement -

ప్రతిజ్ఞ ఒకటి.. ఆచరణ మరొకటా?

ఇటీవల ట్రాఫిక్‌ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని,రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచాలని ప్రతిజ్ఞ చేయించిన ఎమ్మెల్యేనే రోడ్డుపై వాహనాలు నిలిపి ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు,రాజకీయ నాయకులు రహదారి నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.జాతీయ రహదారిపై నిత్యం భారీగా వాహనాల రాకపోకలు సాగుతుంటాయని,ఇలాంటి రద్దీ ప్రాంతాల్లో వాహనాలను నిలిపి కార్యకర్తలను కలవడం వల్ల ప్రమాదాలకు కూడా అవకాశం ఉంటుందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు.

నాయకులకో న్యాయం.. సామాన్యులకో న్యాయమా?

సాధారణ వాహనదారులు రహదారిపై వాహనం నిలిపితే ట్రాఫిక్‌ పోలీసులు నిబంధనల పేరుతో చర్యలు తీసుకుంటారని,మరి రాజకీయ నాయకులు,కార్యకర్తలు రహదారిపై వాహనాలను నిలిపి రాకపోకలకు అంతరాయం కలిగిస్తే ఎందుకు పట్టించుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.రాజకీయ సమావేశాలు,నాయకుల పర్యటనల సమయంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని,జాతీయ రహదారిపై వాహనాలను నిలిపి కార్యకర్తలను కలిసే పరిస్థితి లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.ప్రజలకు ట్రాఫిక్‌ నిబంధనలు చెప్పే నాయకులే ముందుగా వాటిని పాటిస్తే ప్రజల్లో మరింత విశ్వాసం ఏర్పడుతుందని పేర్కొంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News