- ఇందిరమ్మ లబ్ధిదారుల ఆందోళన!
- నెలలు గడుస్తున్నా ఖాతాల్లో జమకాని చివరి విడత నిధులు.. అప్పుల ఊబిలో లబ్ధిదారులు ..!
- అధికారుల చుట్టూ ప్రదక్షిణలు !
సొంతింటి కలను నిజం చేసుకునేందుకు పేదలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ పథకం(Indiramma Illu) ద్వారా గూడు నిర్మించుకోవాలని భావించిన లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న తీవ్ర జాప్యం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. నిర్మాణాలు పూర్తయి, రంగులు వేసి గృహప్రవేశాలు చేసిన .. ఆఖరి విడత బిల్లులు ఖాతాల్లో పడకపోవడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.

పూర్తయినా అందని ఆఖరి బిల్లు :
ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునాది, గోడలు, పైకప్పు, దశల వరకు బిల్లులు విడుదలైయ్యాయి. అయితే చివరి దశ పనులు పూర్తయిన తర్వాత రావాల్సిన ఆఖరి విడత చెల్లింపుల వద్దే అసలు సమస్య మొదలైంది. అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, జియో ట్యాగింగ్ పూర్తి చేసి నివేదికలు సమర్పించినప్పటికీ.. నిధులు మాత్రం ఖాతాల్లో జమ కావడం లేదు. నెలలు గడుస్తున్నా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో పైసాలు పడకపోవడంతో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది.
అప్పుల ఊబిలో లబ్ధిదారులు:
ప్రభుత్వం బిల్లులు సకాలంలో ఇస్తుందన్న నమ్మకంతో ఎక్కువ మంది ప్రైవేట్ వ్యక్తుల వద్ద, వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి నిర్మాణాలు పూర్తి చేశారు. సిమెంట్, ఇసుక, ఐరన్ కొనుగోళ్లు, తాపీ మేస్త్రీల కూలీల బకాయిలు పేరుకుపోయాయి. ఇప్పుడు చివరి విడత సొమ్ము రాకపోవడంతో చేసిన అప్పులకు వడ్డీలు తడిసి మోపెడవుతున్నాయి. అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేస్తుండటంతో లబ్ధిదారులు మానసిక వేదనకు గురవుతున్నారు.

కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు.. పొంతనలేని సమాధానాలు
బిల్లుల కోసం లబ్ధిదారులు నిత్యం హౌసింగ్ కార్యాలయాలు, మండల పరిషత్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అయితే”పై స్థాయిలోనే నిధులు విడుదల కాలేదని”, “వచ్చే వారం పడతాయని” అధికారులు కాలయాపన చేస్తుండటమే తప్ప పరిష్కారం చూపడం లేదని బాధితులు వాపోతున్నారు.
వెంటనే నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి
ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపి, పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల చివరి విడత నిధులను తక్షణమే విడుదల చేయాలని పేదలు కోరుతున్నారు. వడ్డీల భారం నుండి తమను గట్టెక్కించి, నిశ్చింతగా సొంతింట్లో అడుగుపెట్టేలా చూడాలని వేడుకుంటున్నారు.
ఇల్లు పూర్తయింది.. కాని చివరి బిల్లు పడలేదు.
భూంపల్లి భాషవ్వ. బ్రాహ్మజీవాడి.తాడ్వాయి
మాకు ఇందిరమ్మ మంజూరు అయ్యింది. మేము ఇల్లు నిర్మాణం పూర్తిచేసి దాదాపు 3 నెలలు అవుతుంది. సార్లు వచ్చి మా ఇంటి ఫోటోలు తీసుకపోయారు. కాని చివరి బిల్లు మాత్రం ఇంకా పడలేదు. బిల్లు ఎప్పుడు,వస్తాదో తెలుస్తలేదు. బిల్లు తొందరగా వచ్చే విధంగా చూడండి సార్లు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
