- రోడ్లు, డ్రైనేజీ ధ్వంసం చేశారని ఆవేదన..
- 11 కేవీ లైన్‌తో ప్రమాదం పొంచి ఉందని వెల్లడి..
గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని ఏజీ కాలనీ వాసులు కాసా గ్రాండ్ డెవలపర్స్ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. డెవలపర్స్ చేపడుతున్న పనుల కారణంగా కాలనీలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మీడియాకు తెలిపారు. కాసా గ్రాండ్ డెవలపర్స్ కాలనీలోని రోడ్లు, డ్రైనేజీ మ్యాన్‌హోల్స్‌ను ధ్వంసం చేశారని, ప్లాట్ల హద్దులను సూచించే హద్దురాళ్లను తొలగించారని కాలనీ వాసులు ఆరోపించారు.

అంతేకాకుండా నిత్యం టిప్పర్ లారీల ద్వారా మట్టిని తరలిస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. కాలనీ పరిధిలో సరైన విద్యుత్ అనుమతులు లేకుండానే 11 కేవీ విద్యుత్ లైన్‌ను ప్రమాదకరంగా ఏర్పాటు(Safety Concern) చేశారని వారు ఆరోపించారు. కాలనీలో ఇళ్ల నిర్మాణ పనులు చేపడుతున్న సమయంలో విద్యుత్ లైన్ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, నిబంధనలకు విరుద్ధంగా పనులు జరిగితే చర్యలు తీసుకోవాలని ఏజీ కాలనీ వాసులు కోరారు. కాలనీ ప్రజల భద్రతకు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
