మంఖల్‌లో 35 ఎకరాల 26 గుంటల భారీ భూ కుంభకోణం
- 954-55 పహాణిలో ‘సర్కార’.. నేడు ప్రైవేట్ పట్టాలు
- సర్వే నం. 608, 609, 610ల్లో రికార్డుల మాయాజాలం
- సెత్వార్ రికార్డులే లేవు.. మరి ప్రైవేట్ హక్కులు ఎలా?
- నాలా మార్పిడితో రూ.వందల కోట్ల భూమికి రెక్కలు?
- నాటి రెవెన్యూ అధికారుల పాత్రపై తీవ్ర ఆరోపణలు…
- ఫిర్యాదు చేసినా ప్రస్తుత తహసీల్దార్ మౌనమెందుకు?
- ప్రభుత్వ భూమి రక్షణకు విచారణ చేపట్టాలని డిమాండ్
రాష్ట్ర రాజధాని నగరానికి కూతవెటు దూరంలో ఉన్న రంగారెడ్డి జిల్లాలో భూమాఫియా అరాచకం తారాస్థాయికి చేరింది. పాలకవర్గాల కండ్లుగప్పి, ప్రభుత్వ అధికారుల అండదండలతో వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి ప్రైవేట్ వ్యక్తుల పరం అవుతున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం, మంఖల్ గ్రామ పరిధిలో ఏకంగా 35 ఎకరాల 26 గుంటల విశాలమైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైన తీరు చూస్తే రెవెన్యూ వ్యవస్థ ఎంతలా భ్రష్టపట్టిందో ఇట్టే అర్థమవుతోంది.Mankhal Land Scam
“కాపలాదారుడే కన్నం వేస్తే.. దొంగలకేం భయం?” అన్నట్లుగా.. రికార్డుల్లో అచ్చంగా ‘సర్కార’ భూమిగా ఉన్న ప్రాంతం.. రాత్రికి రాత్రి ప్రైవేట్ వ్యక్తుల పట్టా భూమిగా ఎలా మారిపోయింది? దీని వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? అనే కోణంలో బట్టబయలవుతున్న సంచలన నిజాలు రెవెన్యూ వ్యవస్థలోని డొల్లతనాన్ని ఎత్తిచూపుతున్నాయి.

కాగితాలపై ‘సర్కార’.. ఆచరణలో ‘పట్టా’! : ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన మంఖల్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 608, 609 మరియు 610 లలోని సుమారు 35 ఎకరాల పైచిలుకు భూమిపై దశాబ్దాలుగా తీవ్రమైన రెవెన్యూ రికార్డుల వ్యత్యాసాలు కొనసాగుతున్నాయి. ఈ భూమికి సంబంధించి అందుబాటులో ఉన్న 1954-55 పహాణి రికార్డులో పట్టాదార్ కాలమ్‌లో స్పష్టంగా ‘సర్కార’ అని నమోదై ఉంది. అంటే ప్రాథమికంగా ఇది ప్రభుత్వ భూమి అనే విషయం చారిత్రక రికార్డుల ద్వారా అక్షరసత్యం. ?కానీ, సర్కారు ఖజానాకు చెందాల్సిన ఈ విశాలమైన భూమిని ఎటువంటి చట్టబద్ధమైన పద్ధతులు లేకుండా, రికార్డులను దళారీలు, అధికారుల సహకారంతో తారుమారు చేసి ప్రైవేట్ వ్యక్తుల పట్టా భూమిగా మార్చేశారనేది ఇప్పుడు తేలిన నిష్ఠుర సత్యం.
సెత్వార్ రికార్డులే లేవు.. మరి ఆమోదం ఎవరిచ్చారు? : ఈ భారీ కుంభకోణంలో అత్యంత విస్మయకరమైన మరియు కీలకమైన అంశం సెత్వార్ రికార్డులకు సంబంధించినది. జిల్లా సర్వే అధికారి రికార్డుల ప్రకారం.. మంఖల్ గ్రామానికి సంబంధించిన సర్వే నం. 608, 609, 610ల సెత్వార్ రికార్డులు అసలు అందుబాటులోనే లేవని అధికారికంగా స్పష్టం చేశారు. మూల రికార్డులు లేనప్పుడు, నాటి తహసీల్దార్ నివేదికలో ఏ సెత్వార్ ఆధారంగా ఈ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మరోవైపు తహసీల్దార్ నివేదికలో ప్రస్తావించినట్టు చెబుతున్న ఫైల్ నంబర్ ఉనికిపై కూడా తీవ్రమైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అప్పటి అధికారుల బరితెగింపు.. బినామీల పేరిట దోపిడీ! : ఈ భూ అన్యాక్రాంతం వెనుక నాటి రెవెన్యూ పెద్దల హస్తం స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, అప్పటి తహసీల్దార్ మహమ్మద్ అలీ, అప్పటి డిప్యూటీ తహసీల్దార్ నవత, అప్పటి సీనియర్ అసిస్టెంట్ కృష్ణ తదితరులు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి, బినామీల పేర్లతో ఈ ప్రభుత్వ భూమిని ప్రైవేట్ పరం చేసినట్లు పక్కా ఆధారాలు లభ్యమవుతున్నాయి. అధికారిక హోదాను అడ్డంపెట్టుకుని వందల కోట్ల విలువైన భూమిని కొల్లగొట్టిన వైనం ఈ పత్రాల ద్వారా బట్టబయలవుతోంది.
39 సబ్-డివిజన్లు.. రియల్ ఎస్టేట్ హస్తగతం! : ఈ 35.26 ఎకరాల భూమిని అత్యంత వ్యూహాత్మకంగా చిన్న చిన్న భాగాలుగా విభజించి, వివిధ వ్యక్తుల పేరిట మరియు కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థల పేరిట మ్యూటేషన్లు చేయించుకున్నారు. ఈ సర్వే నంబర్ల పరిధిలో మొత్తం 39 సబ్-డివిజన్లు సృష్టించబడి, పాస్‌బుక్‌లు జారీ చేయడమే కాకుండా, నాలా మార్పిడి చర్యలు మరియు రిజిస్ట్రేషన్లు కూడా జరిగినట్లు సమాచారం.
- సర్వే నం.608: మందాడి రితేశ్ రెడ్డి, కాలకుంట్ల తిరుపతి రావు, మొహమ్మద్ అబ్దుల్ కబీర్, వద్దిరెడ్డి బాల్‌రెడ్డి, వీకేఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, పల్లాపు గోవర్ధన్ తదితరుల పేరిట వివిధ విస్తీర్ణాల్లో సబ్-డివిజన్లు జరిగాయి.
- సర్వే నం.609: వద్దిరెడ్డి బాల్‌రెడ్డి, వీకేఆర్ బిల్డర్స్, తబ్రేజుద్దీన్ అమీరుద్దీన్, మొహమ్మద్ అబ్దుల్ రహీమ్, మొహమ్మద్ అబ్దుల్ కబీర్ పేరిట విస్తృతంగా భూ విభజన జరిగింది.
- సర్వే నం.610: చెక్కల ఎల్లయ్య, రాయా ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ముసినిపల్లి అశ్విన్, నాంపల్లి సిద్ధార్థ్, శివగల్ల పెద్ద చౌడయ్య మరియు వీకేఆర్ బిల్డర్స్ పేరిట పలు సబ్-డివిజన్లు నమోదయ్యాయి.
ముఖ్యంగా ఒకే ఖాతా నంబర్ (61626) కింద ‘వికేఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స’ పేరుతో పెద్దఎత్తున సబ్-డివిజన్లు ఉండటం ఈ కుంభకోణంలో కార్పొరేట్ సంస్థల హస్తాన్ని, బరితెగింపును తేటతెల్లం చేస్తోంది. ఇంతటి భారీ భూ కుంభకోణంపై పూర్తి ఆధారాలతో సహా బాధ్యత గల వ్యక్తులు మహేశ్వరం మండలం ప్రస్తుత తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ, ఆయన స్పందించకపోవడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతున్నా కనీసం స్పందించకపోవడానికి కారణం ఏమిటని? సిబ్బంది, ఉన్నతాధికారుల పాత్రపై దర్యాప్తు జరగకుండా కాపాడే ప్రయత్నం జరుగుతోందా? అనే ప్రశ్నలు ప్రజల నుంచి తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వానికి కనువిప్పు.. సమగ్ర విచారణకు డిమాండ్ : ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో భాగంగా రెవెన్యూ మరియు సర్వే శాఖలు వెంటనే స్పందించి క్రింది అంశాలపై సమగ్ర విచారణ చేపట్టాల్సిన తక్షణ అవసరం ఉంది:
- ప్రత్యేక విచారణ : అప్పట్లో నడిచిన బినామీ లావాదేవీలు, ఫైళ్ల మానిప్యులేషన్‌పై సిట్టింగ్ అధికారులతో లేదా ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలి.
- రికార్డుల రద్దు: అక్రమంగా జారీ చేసిన సబ్-డివిజన్లు, మ్యూటేషన్లు, రిజిస్ట్రేషన్లు మరియు నాలా ప్రొసీడింగ్స్‌ను తక్షణమే రద్దు చేసి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలి.
- కఠిన చర్యలు: ఈ అక్రమాలకు పాల్పడిన నాటి కలెక్టర్, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, సీనియర్ ఆఫీసర్లు మరియు సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి.
“కంచె చేను మేసినట్లు” ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన యంత్రాగం నిద్రమత్తు వీడితేనే ఖజానాకు నష్టం వాటిల్లకుండా ఉంటుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉదంతంపై సుమోటోగా స్పందించి, మంఖల్ భూముల బాగోతంపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
