- ఇక్కడి రైతుల కష్టాలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కనపడవా??
- కనీసం నెల రోజులైన నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలి.!
- బిఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు పిల్లుట్ల రఘు డిమాండ్.!
అప్రకటిత విద్యుత్ కోతలు రైతుల పాలిట శాపంగా మారాయని పంటలు చేతికొచ్చే కీలక సమయంలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోతే అన్నదాతలకు తీవ్ర నష్టం తప్పదని హుజూర్ నగర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ నాయకుడు పిల్లుట్ల రఘు ఆగ్రహం వ్యక్తం చేశారు (BRS Protest). శుక్రవారం మఠంపల్లి మండలంలోని రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను నిరసిస్తూ పిల్లుట్ల రఘు ఆధ్వర్యంలో మండలంలోని 132/33కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ను ముట్టడించి భారీ ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా సబ్ స్టేషన్ లో మినిట్స్ బుక్,ఇతర రిజిస్టర్లను పరిశీలించి అక్కడి సిబ్బందితో పూర్తి వివరాలను తెలుసుకున్నారు. మండలంలోని రైతులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలో పాల్గొని వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రైతుల కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా?
ఈ సందర్భంగా పిల్లుట్ల రఘు మీడియాతో మాట్లాడుతూ సాగునీటి సమస్యలకు తోడు విద్యుత్ కోతలు, లో వోల్టేజ్, ట్రిప్పింగ్ సమస్యలు రైతులను మరింత కుంగదీస్తున్నాయని విమర్శించారు. ప్రస్తుతం రైతులకు కనీసం ఐదు నుంచి ఆరు గంటల విద్యుత్ కూడా సక్రమంగా అందడం లేదని కరెంట్ ఎప్పుడు వస్తుందో పోతుందో రైతులకి తెలియటం లేదని ఆరోపించారు.వ్యవసాయానికి అవసరమైన సమయంలో నాణ్యమైన విద్యుత్ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై అదే సమయంలో విద్యుత్ అధికారులకు ఉందన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఇరవై నాలుగు గంటలు ఉచిత, నాణ్యమైన విద్యుత్ ను నిరంతరంగా అందించామని ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో విద్యుత్ కోతలతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు (BRS Protest). అదే విధంగా ప్రభుత్వం ట్రూ అప్ చార్జెస్ పేరిట సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు కరెంటు అందించలేని పాలన ఎందుకని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పంటలు ఎండిపోకుండా సక్రమంగా విద్యుత్ ను అందించాలని అందుకు తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డికి తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి రఘు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతులకు నిరంతర విద్యుత్ అందిస్తారా లేదా అన్నది తేల్చుకోవాలని సవాల్ విసిరారు. ప్రస్తుతం పంటలు పొట్ట దశకు వచ్చాయని ఈ సమయంలో కనీసం నెల రోజుల పాటు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తే సాగు నీరు అంది రైతులు పంటలను కాపాడుకొనే అవకాశం ఉందని పేర్కొన్నారు.హెలికాప్టర్లో కూర్చొని గాలిలో చక్కర్లు కొడుతూ, సాధ్యం కానీ హామీలు ఇచ్చి ఇక్కడి రైతులను,సామాన్య ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. మంత్రి ఉత్తమ్ మాటలకే పరిమితం కాకుండా నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. రైతులకు విద్యుత్ సమస్య వస్తే స్థానిక మంత్రి, అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
నియోజకవర్గంలో పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి నెలకొంటే రైతుల సమస్యలను పట్టించుకోవాల్సిన బాధ్యత మంత్రిపై ఉందన్నారు. రైతుల పంటలు ఎండిపోతుంటే పట్టించుకోకుండా ఇతర విషయాలపై దృష్టి పెట్టడం సరైన పద్ధతి కాదని అన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గ రైతులు మీకు ఓటేయలేదా ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నది వారి సమస్యలను పరిష్కరించేందుకే కదా అంటూ ప్రశ్నించారు. రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్, సాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు (BRS Protest). రైతుల ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆందోళనలను రాష్ట్ర స్థాయిలో మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ప్రధాన రహదారి నుంచి సబ్‌స్టేషన్ వరకు భారీ నిరసన ర్యాలీ
విద్యుత్ కోతలు, సాగునీటి సమస్యలను నిరసిస్తూ రైతులు, బీఆర్‌ఎస్ శ్రేణులు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించి సబ్‌స్టేషన్ వద్ద ధర్నా చేపట్టారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందించాలని పంటలను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ జడ్పీటీసీ జగన్ నాయక్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణంరాజు, సీనియర్ ఉద్యమ నాయకుడు అడ్వకేట్ నగేష్ రాథోడ్, వీరారెడ్డి, ఇస్మాయిల్, సైదా, మాజీ ఎంపీటీసీ వెంకట్ రెడ్డి, రామారావు, కిరణ్,సైదా, పిల్లుట్ల కొండల్, సర్పంచులు హరిచంద్రు, భేత వెంకట్ రెడ్డి, నాగయ్య, శివశంకర్, రామాంజి, గోవింద్, దాసరి వెంకటరమణ, లక్ష్మీనరసింహ రాజు, రహీం, కృష్ణయ్య, రాముడు, సైదా నాయక్, టిక్యా నాయక్, భరత్, రంగా, నవీన్, శ్రీను, రాజీవ్, సోమయ్య, బాణావత్ బాబు,శోభన్ బాబు, రైతులు, బిఆర్ఎస్ కార్యకర్తలు (BRS Protest) తదితరులు పాల్గొన్నారు. (https://epaper.aadabhyderabad.in/)(Youtube)
