- ఢిల్లీలో సరికొత్త టోల్ వసూలు విధానం..Delhi Toll System
- ప్రవేశ పెట్టనున్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్..
దేశ రాజధాని ఢిల్లీలోకి ప్రవేశించే వాహనదారులు ఇకపై టోల్ ప్లాజాల వద్ద నిమిషాల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. నగర సరిహద్దుల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, ప్రయాణికుల సమయం, ఇంధనాన్ని ఆదా చేయడంతో పాటు వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సరికొత్త టోల్ వసూలు విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ‘మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో’ గా పిలిచే ఈ ఎలక్ట్రానిక్ టోలింగ్ వ్యవస్థ ఏర్పాటు ప్రక్రియను ఎంసీడీ వేగవంతం చేసింది. ఇప్పటికే ఘాజీపూర్ టోల్ ప్లాజా వద్ద ఒక యూనిట్‌ను ఏర్పాటు చేయగా, త్వరలోనే ఢిల్లీలోని అన్ని ప్రవేశ మార్గాల వద్ద దీన్ని అమలు చేయనున్నారు.Delhi Toll System
‘మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో’ అనేది ఫాస్టాగ్ వ్యవస్థకు మరింత ఆధునిక రూపం. ఈ విధానంలో వాహనాలు టోల్ బూత్‌ల వద్ద ఆగడం లేదా వేగాన్ని తగ్గించడం చేయాల్సిన అవసరం లేదు. రహదారిపై సాధారణ వేగంతో ప్రయాణిస్తున్నప్పటికీ, ఆటోమేటిక్‌గా టోల్ రుసుము చెల్లింపు పూర్తవుతుంది. సంప్రదాయ బూత్‌లు, బ్యారియర్లకు బదులుగా, రహదారిపైన అమర్చిన హై-పెర్‌ఫార్మెన్స్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) రీడర్లు ఈ పనిని పూర్తి చేస్తాయి. వాహనాలు వాటి కింద నుంచి వెళుతున్నప్పుడు, వాటిపై ఉన్న ఫాస్టాగ్‌ను ఈ రీడర్లు స్కాన్ చేసి, ఆటోమేటిక్‌గా టోల్ రుసుమును ఖాతా నుంచి మినహాయించుకుంటాయి. దీనివల్ల టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరడం తప్పుతుంది. ఈ కొత్త విధానం వల్ల ఢిల్లీలోకి ప్రవేశించే అన్ని వాహనాలకు, ముఖ్యంగా ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లో ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ టోల్ షిఫ్ట్ ఇన్‌చార్జ్ అమితాబ్ బచ్చన్ ‘ఎన్డీటీవీ’కి తెలిపారు. “కార్ల వినియోగదారులు ఇక ఆగాల్సిన పనిలేదు, ట్రాఫిక్ నిరంతరాయంగా సాగిపోతుంది” అని ఆయన వివరించారు. ఈ విధానం వల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గడం, సమయం ఆదా అవ్వడంతో పాటు వాహనాలు టోల్ ప్లాజాల వద్ద అనవసరంగా ఆగకపోవడం వల్ల ఇంధన వినియోగం, కాలుష్య ఉద్గారాలు కూడా తగ్గుతాయి.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
