Homeమహబూబ్‌నగర్‌RTC Bus Drivers Protest | ఒత్తిళ్లు తట్టుకోలేక బస్సులు నిలిపివేత!..

RTC Bus Drivers Protest | ఒత్తిళ్లు తట్టుకోలేక బస్సులు నిలిపివేత!..

  • డిపో మేనేజర్ తీరుపై ప్రైవేట్ ఆర్టీసీ డ్రైవర్ల ఆగ్రహం.
  • పరిమితికి మించి ప్రయాణికులు.. ప్రమాదం జరిగితే డ్రైవర్లదే బాధ్యతా?
  • సమస్యలు పరిష్కరించే వరకు బస్సులు నడపబోమని హెచ్చరిక..

వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రైవేట్ ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసనకు(RTC Bus Drivers Protest) దిగారు. డిపో మేనేజర్ ఒత్తిళ్లు తట్టుకోలేకపోతున్నామని, బస్సుల్లో ప్రయాణికుల రద్దీ, అదనపు స్టాపులు, మైలేజీ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ డిపో సమీపంలో బస్సులను శనివారం నిలిపివేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు బస్సులు నడపబోమని డిమాండ్ చేశారు.

ప్రమాదం జరిగితే డ్రైవర్లదే బాధ్యతా?..

- Advertisement -

బస్సుల్లో సీటింగ్ సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కిస్తున్నారని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. కొందరు ప్రయాణికులు బస్సు డోర్ల వద్ద వేలాడుతూ, నిలబడి ప్రయాణిస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రమాదం జరిగితే బాధ్యత మాత్రం డ్రైవర్లపైనే పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల భద్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితుల్లో బస్సులు నడపాల్సి వస్తోందని వాపోతున్నారు.

స్టాపులు పెరిగితే మైలేజీ ఎలా వస్తుంది?..

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమల్లోకి వచ్చిన తర్వాత నిర్ణీత స్టాపులతో సంబంధం లేకుండా పలుచోట్ల ప్రయాణికులు ఎక్కడం, దిగడం జరుగుతోందని డ్రైవర్లు చెబుతున్నారు. ఎక్స్‌ప్రెస్ బస్సులకు సైతం అదనపు స్టాపులు పెంచడం వల్ల ప్రయాణ సమయం, ఇంధన వినియోగం పెరిగి మైలేజీపై ప్రభావం పడుతోందని పేర్కొంటున్నారు. ఆశించిన మైలేజీ రాకపోతే బస్సు యజమానుల నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బస్సు ఆపకపోతే ఫిర్యాదులు .. డ్రైవర్లపై ఒత్తిళ్లు!..

ప్రతి చోటా బస్సులు ఆపడం సాధ్యం కాకపోయినా, బస్సు ఆపలేదనే కారణంతో కొందరు ప్రయాణికులు డిపో మేనేజర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదులు చేస్తున్నారని డ్రైవర్లు పేర్కొంటున్నారు. దీంతో ఒకవైపు ప్రయాణికుల నుంచి, మరోవైపు అధికారుల ఒత్తిళ్లతో విధులు నిర్వహించడం కష్టంగా మారిందని వాపోతున్నారు.

సమస్యలు పరిష్కరించాల్సిందే!..

ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూనే డ్రైవర్లపై అనవసర ఒత్తిళ్లు తగ్గించాలని, బస్సుల స్టాపులు, ప్రయాణికుల రద్దీ, మైలేజీ సమస్యలపై స్పష్టమైన విధివిధానాలు రూపొందించాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలను అధికారులు పట్టించుకోకపోతే బస్సులు నడిపే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. ప్రైవేట్ ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై సంబంధిత అధికారులు స్పందించి, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే, డ్రైవర్లు చేసిన ఆరోపణలపై డిపో మేనేజర్, సంబంధిత అధికారుల వివరణ వెలువడాల్సి ఉంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News