- ఉత్తర కన్నడ జిల్లాలో వెలసిన క్షేత్రం..
పచ్చని అడవిలోకి వెళ్తే ఎనలేని ప్రశాంతత లభిస్తుంది. అలాంటి చోట గలగలా పారే నది ఉంటే ఎలా ఉంటుంది? అందులో ఇష్టదైవం శివయ్య కనిపిస్తే ఎలా ఉంటుంది? చూడడానికి రెండు కళ్లూ సరిపోతాయా?! సరిగ్గా ఇలాంటి అద్భుత ప్రదేశం కర్ణాటకలో ఉంది! దట్టమైన అడవులు, పచ్చని కొండల మధ్య పరవళ్లు తొక్కే నది, ఆ నది మధ్యలో సహజసిద్ధంగా ఏర్పడిన నల్లటి శిలలు, వాటిపై అత్యంత నైపుణ్యంతో చెక్కిన శతాధిక శివలింగాలు, నంది రూపాలు! ఇవన్నీ భక్తులను మంత్రముగ్దులను చేస్తున్నాయి. ఒకటీ రెండు కాదు.. ఈ నదిలో దాదాపు వెయ్యికి పైగా శివయ్య రూపాలు కనిపిస్తాయి. అందుకే ఈ పవిత్ర స్థలానికి ‘సహస్రలింగ’ అనే పేరు వచ్చింది.
ఇక్కడికి వచ్చే భక్తులు ఈ అద్భుత దృశ్యాన్ని చూసి తన్మయత్వంలో మునిగిపోతారు. పర్యాటకులను సైతం ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రకృతి రమణీయత కలగలిసిన ఈ ఆధ్యాత్మిక క్షేత్రాన్ని కనులారా వీక్షించాలంటే కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాకు వెళ్లాల్సిందే. ప్రసిద్ధ సిర్సీ పట్టణానికి దాదాపు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ప్రవహించే పవిత్ర శాల్మలా నదిలోనే ఈ వింత కొలువై ఉంది. కేవలం దూరం నుండి చూడటమే కాకుండా, భక్తులు నేరుగా నది మధ్యలోకి వెళ్లి, ప్రవహించే ఆ నదీ జలాలతోనే స్వామివారికి స్వయంగా అభిషేకం చేసి తన్మయత్వం చెందుతారు.
