ఈ రోజు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ టిటిఐలో పనిచేస్తూన్న సబ్ ఇన్స్పెక్టర్ నరసింహారావు పదవీ విరమణ పొందారు. నరసింహారావును శనివారం మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సన్మానించారు. మల్కాజ్గిరి సీపీ అవినాష్ మహంతి ఐపిఎస్ మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగం ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఎంతో కాలం పాటు పోలీసుశాఖలో సమర్థవంతంగా, క్రమశిక్షణతో పనిచేసి తమ సేవలు అందించినందుకు అభినందించారు.
పదవీ విరమణ అనంతరం విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని, ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ చూపాలని, పెన్షన్, ఇతర ఆర్థిక అంశాల పట్ల క్రమశిక్షణ పాటించాలని సూచించారు. వారికి రావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలు త్వరగా వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అడ్మిన్ ఇందిరా, అడిషనల్ డీసీపీ అడ్మిన్ శివ కుమార్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు సిహెచ్. భద్రా రెడ్డి, కో ఆపరేటివ్ ఏఓ ప్రదీప్, కో ఆపరేటివ్ డైరెక్టర్స్ తదితరులు పాల్గొన్నారు.
