Friday, May 15, 2026
Homeఆదిలాబాద్Strict Action | పశువుల అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు

Strict Action | పశువుల అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు

  • జిల్లావ్యాప్తంగా చెక్‌పోస్టులు,ప్రత్యేక తనిఖీలు: మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్*

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పశువుల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ తెలిపారు.మంచిర్యాల జోన్ పరిధిలోని గోరక్షక్ సభ్యులతో మంచిర్యాల పట్టణ కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాల్‌లో పశువుల అక్రమ రవాణా నిరోధంపై సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో చట్టపరమైన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు,పోలీస్ శాఖ చేపడుతున్న చర్యల గురించి డీసీపీ వివరించారు.

ఈ సందర్భంగా డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ పశువుల అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా గోరక్షక్ సభ్యులతో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టాల ప్రకారం ఆవులు, దూడలను వధించడం నిషేధించబడిందని పేర్కొన్నారు.అలాగే పశువులు లేదా ఇతర మూగజీవాలను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించే సమయంలో వాటికి ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని చెప్పారు.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ యాక్ట్,కౌస్లాటర్ యాక్ట్, భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) చట్టాల కింద కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -

గోరక్షక్ పేరుతో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దాడులు చేయడం, వాహనాలను ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు.సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, వాస్తవాలు నిర్ధారించకుండా వాటిని పంచుకోవద్దని ప్రజలకు సూచించారు.

ఎవరైనా పశువుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే రామగుండం పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712656597, డయల్-100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.పశువుల రవాణాకు సంబంధించి వెటర్నరీ డాక్టర్ ఆమోదించిన ధ్రువపత్రం తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలిపారు. అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు జిల్లావ్యాప్తంగా ఏడు శాశ్వత చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.అదేవిధంగా ప్రధాన రహదారులతో పాటు పక్క రాష్ట్రాలు, పక్క జిల్లాల నుంచి వచ్చే మార్గాల్లో సుమారు 15 ఆకస్మిక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

చట్టం ప్రకారం పశువుల అక్రమ రవాణాను అరికట్టడం పోలీసుల బాధ్యత మాత్రమే కాకుండా ప్రజలు, గోరక్షక్ సభ్యులందరి బాధ్యత కూడా అని పేర్కొన్నారు. ఎవరికైనా అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే డయల్-100 లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు.మంచిర్యాల జోన్ పరిధిలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని తెలిపారు.వాహనాల్లో తరలిస్తున్న పశువుల వివరాలు,వెటర్నరీ డాక్టర్ సర్టిఫికెట్ వివరాలు,ఫోటోలు తీసి ప్రత్యేక గ్రూపుల్లో అప్‌లోడ్ చేస్తున్నామని చెప్పారు.

ఈ మొత్తం ప్రక్రియను ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.మంచిర్యాల జిల్లా పారిశ్రామిక ప్రాంతం అనేక ప్రాంతాల ప్రజలకు ఉపాధి కల్పిస్తోందని పేర్కొన్నారు.వివిధ ప్రాంతాల ప్రజలు ఇక్కడ కలిసి జీవిస్తున్న నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ,సామరస్య వాతావరణం కొనసాగించడంలో ప్రజాప్రతినిధులు, ప్రజలు,మీడియా మిత్రులు అందరి సహకారం అవసరమన్నారు.

ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించి సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు తోడ్పడాలని కోరారు.ఈ సమావేశంలో మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్, మంచిర్యాల పట్టణ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్‌రావు, మంచిర్యాల రూరల్ ఇన్‌స్పెక్టర్ రవీందర్, లక్షెట్టిపేట్ సీఐ రమణమూర్తి, శ్రీరాంపూర్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, బెల్లంపల్లి రూరల్ సీఐ హనుక్,మంచిర్యాల జోన్ ఎస్‌ఐలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News