- సంఘాల నేతలతో ముఖ్యమంత్రి వరుస మంతనాలు
- ముదిరాజ్ నేతలతో భేటీ.. పీఆర్టీయూతో చర్చలు.. ?
- ఎమ్మెల్సీ ఎన్నికల వేళ రేవంత్ దూకుడు.. రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు..
- భిక్షం గౌడ్ పోటీ.. రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్..
- ఉపాధ్యాయ సంఘాలతో సీఎం మంతనాలు.. తెరవెనుక రాజకీయ లెక్కలేంటి?
హైదరాబాద్: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) వరుస భేటీలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. ఇటీవల ముదిరాజ్ సామాజికవర్గ నేతలతో సమావేశమైన సీఎం.. తాజాగా పీఆర్టీయూ నాయకులు, ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశాలు కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం సామాజిక, ఉద్యోగ సంఘాల మద్దతు కూడగట్టే వ్యూహంలో భాగమా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ సామ రామ్మోహన్ రెడ్డిని, నల్గొండ–వరంగల్–ఖమ్మం స్థానానికి రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించింది.ఈ రెండు స్థానాలను గెలుచుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలో సీఎం వరుస సమావేశాలు ఆసక్తి రేపుతున్నాయి.మరోవైపు పీఆర్టీయూ అధ్యక్షుడు సుంకరి భిక్షం గౌడ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకోవడం, బీజేపీ టికెట్ ఆశిస్తున్నారనే ప్రచారం రాజకీయంగా మరింత ఆసక్తిని పెంచుతోంది.

ఇలాంటి సమయంలో పీఆర్టీయూ నేతలు సీఎంను కలవడం వెనుక అసలు కారణమేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.అయితే పీఆర్టీయూ నేతలు మాత్రం ఈ భేటీ పూర్తిగా ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసమేనని స్పష్టం చేస్తున్నాయి . ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన సుంకరి భిక్షం గౌడ్, ప్రధాన కార్యదర్శి బట్టాపురం మధుసూదన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని(Revanth Reddy) మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా పెండింగ్ పీఆర్సీ, హెల్త్ కార్డుల అమలు, విద్యారంగ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకట్ రెడ్డి, జగన్ మోహన్ గుప్తా, ఆడిట్ కమిటీ చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.మొత్తానికి ఈ భేటీలు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికే పరిమితమవుతాయా? లేక రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం చూపుతాయా? అన్నది వేచి చూడాలి.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
