- జవహర్‌నగర్‌లో(Jawahar Nagar) ప్రభుత్వ స్థలంలో భారీ నిర్మాణాలు
- ఫిర్యాదులు చేసినా నామమాత్రపు చర్యలేనంటున్న స్థానికులు
- అధికారుల తీరుపై అనుమానాలు.. జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలని డిమాండ్
జవహర్‌నగర్ దేవేందర్‌నగర్ ప్రాంతంలో ప్రభుత్వ స్థలంలో భారీ స్థాయిలో బహుళ నిర్మాణాలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూమిని పరిరక్షించాల్సిన అధికారులు అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోకుండా నామమాత్రపు చర్యలకే పరిమితమవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు జరుగుతున్న విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఒకవైపు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ మరోవైపు నిర్మాణాలు కొనసాగుతుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపాల్సిన అధికార యంత్రాంగం ఉత్తపాదంతో వ్యవహరిస్తోందా? అనే ప్రశ్నలు స్థానికుల్లో తలెత్తుతున్నాయి. కొందరు అధికారులు అక్రమ నిర్మాణదారుల పట్ల చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. భారీ మొత్తంలో ముడుపుల వ్యవహారం జరుగుతోందనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నప్పటికీ, దీనిపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు. ఈ ఆరోపణలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రభుత్వ భూముల పరిరక్షణలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై జిల్లా కలెక్టర్, ఆర్డీఓ ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. కిందిస్థాయి అధికారుల పనితీరుపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసి, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలను ప్రోత్సహించినట్లు తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
దేవేందర్‌నగర్‌లో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు వెంటనే స్థల పరిశీలన నిర్వహించి, భూమి స్వరూపాన్ని నిర్ధారించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వ భూమి అయితే వెంటనే అక్రమ నిర్మాణాలను నిలిపివేసి, భూమికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి ప్రభుత్వ భూములను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
