- బాధిత కుటుంబాలకు పరిహారం కాదు రూ. 50 లక్షల ఫైన్ కట్టాలి.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి
- దత్తత తీసుకున్న జిల్లాలో చిన్నారులు చనిపోతే ముఖ్యమంత్రికి పరామర్శించే తీరిక లేదా?
- హెల్త్ మినిస్టర్ ఎక్స్ కర్షన్ కు వచ్చినట్లు వచ్చి బాధ్యత లేకుండా వ్యవహరించారు
- ముఖ్యమంత్రికి నెల టైమిస్తున్నాం. ఈలోగా జిల్లాలో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలి
- లేదంటే ఏజెన్సీలోని ఆదివాసీలతో కలిసి ఆదిలాబాద్ ను ఘెరావ్ చేస్తాం
- తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఆదిలాబాద్ రిమ్స్ లో అగ్ని ప్రమాదం జరిగిన ఎస్ఎన్ సీయూ పరిశీలన
ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం జరిగి ఐదుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హ*త్యలేనని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రోజులు కూడా నిండని పసిపిల్లలు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న జిల్లాలో ఇంత హృదయ విదాకరమైన సంఘటన జరిగితే వచ్చి చూసే తీరిక లేదా అని ప్రశ్నించారు.
ఫుట్ బాల్ ఆడేందుకు, విదేశాల్లో తిరిగేందుకు ముఖ్యమంత్రికి సమయం ఉంది గానీ మైనార్టీ, ఆదివాసీ చిన్నారులు చనిపోతే వచ్చి చూసే తీరిక లేకుండా పోయిందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం జరిగిన ఎస్ఎన్ సీయూను బుధవారం కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును హాస్పిటల్ సిబ్బందిని, చిన్నారుల తల్లిదండ్రులు, బంధువులను అడిగి తెలుసుకున్నారు.

చిన్నారుల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 50 లక్షల చొప్పున ఫైన్ కట్టాలి
ప్రభుత్వ నిర్లక్ష్యంగా కారణంగా చిన్నారులను కోల్పోయిన కుటుంబాలకు రూ. 50 లక్షలు పరిహారం ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. నిజానికి ప్రభుత్వం ఇచ్చేది పరిహారం కాదు ఫైన్ అని అన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకే కాకుండా ప్రమాదం నుంచి బయటపడి చికిత్స పొందుతున్న చిన్నారుల కుటుంబాలకు కూడా అంతే పరిహారం ఇవ్వాలని కోరారు. వారంతా కూడా పేదవాళ్లేనని భవిష్యత్ లో ఆ పిల్లలకు వచ్చే ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని పరిహారం ఇవ్వాలన్నారు.
ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న జిల్లాలో పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటుందా అని ఆవేదన వ్యక్తం చేశారు. 30 నెలలుగా ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి గానీ హెల్త్ మినిస్టర్ గానీ రాకపోవడం దారుణమని అన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత హాస్పిటల్ సందర్శనకు వచ్చిన హెల్త్ మినిస్టర్ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పారు.
ఏదో ఎక్స్ కర్షన్ కు వచ్చినట్లు వచ్చి కనీసం గంటన్నర కూడా లేరన్నారు. బాధితులకు భరోసా ఇవ్వడం గానీ వారి బాధను పంచుకోవటం కానీ చేయలేదని మండిపడ్డారు. పేదలైన బాధితులకు పైసా సాయం చేయకపోవడం అన్యాయమన్నారు. వచ్చారు.. చూశారు.. వెళ్లారు.. అన్నట్లుగానే మంత్రి వ్యవహారం ఉందని మండిపడ్డారు. ఈ సంఘనటలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు కచ్చితంగా మూల్యం చెల్లించకోక తప్పదని హెచ్చరించారు.

ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
రిమ్స్ లో జరిగిన హృదయవిదాకరమైన సంఘటన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని అన్నారు. సరైన మెయింటెన్స్ లేకపోవటం, కావాల్సినన్నీ నిధులు కేటాయించకపోవటంతోనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఆదిలాబాద్ రిమ్స్ లో ఇదే మొదటి సంఘటన కాదని… గత ఏడాదిలో ఈ హాస్పిటల్ లో 15 వందల మంది చేరితే 204 మంది చిన్నారులు చనిపోయారని చెప్పారు. అంతకుముందు ఏడాదిలో13 వందల మంది చిన్నారులు చేరితే 174 మంది చిన్నారులు మృతి చెందారని.. అయినప్పటికీ ఈ పరిస్థితిపై ప్రభుత్వం సమీక్ష నిర్వహించలేదన్నారు.
ఏజెన్సీ ప్రాంతాల నుంచి హాస్పిటల్ కు వచ్చే రోడ్లు అధ్వానంగా ఉండటంతో హాస్పిటల్ కు చేరే వరకే గర్భిణులు చనిపోతున్నారని అన్నారు. హాస్పిటల్ లో సరైన వసతులు లేక చిన్నారులు చనిపోతున్నారని చెప్పారు. 350 మంది డాక్టర్లు ఉండాల్సిన 150 మందే డాక్టర్లు ఉన్నారని.. 20 శాతం శానిటేషన్ సిబ్బందితోనే పనిచేయిస్తున్నారన్నారు. 150 ఏసీలు ఉన్న చోట ఒక్క ఏసీ మెకానిక్ లేకపోవటం ఏమిటని ఆమె ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా 500 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు.
ఒక్క రిమ్స్ లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఇవే పరిస్థితులు ఉన్నాయన్నారు. వరంగల్ ఎంజీఎంలో పై కప్పు కూలిపోయిన సంఘటన, నాగర్ కర్నూల్ లో ఈసీజీ మెషీన్ ను ఎలుకలు కొరికి సంఘటనలు ఆమె గుర్తు చేశారు. రాష్ట్ర బడ్జెట్ లో 10 శాతం హెల్త్ కు కేటాయిస్తామన్న ముఖ్యమంత్రి 5 శాతం కూడా నిధులు కేటాయించటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిల్లో కూడా సగం జీతాలకే పోతుందని ఇక ప్రజలకు మెరుగైన వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నించారు. వెంటనే రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో పరిస్థితులపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.

హాస్పిటల్ డైరెక్టర్ ను సస్పెండ్ చేయాలి
రిమ్స్ అగ్ని ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాటు హాస్పిటల్ డైరెక్టర్ నిర్లక్ష్యం కూడా కారణమని అన్నారు. హాస్పిటల్ లో పరిస్థితిని ప్రభుత్వానికి వివరించడంలో ఆయన విఫలమయ్యారని అన్నారు. కలెక్టర్ కూడా హాస్పిటల్ పరిస్థితిపై రివ్యూ నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్ డైరెక్టర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ప్రమాదం నుంచి బయటపడి ప్రైవేట్ హాస్పిటల్ లో చేరిన పిల్లలకు సంబంధించిన బిల్లును ప్రభుత్వమే చెల్లించాలని కోరారు.
ముఖ్యమంత్రికి నెల రోజులు సమయం ఇస్తున్న
ఆదిలాబాద్ జిల్లాలో నెల రోజుల్లో ప్రజలకు సరైన వైద్య సదుపాయాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలు చెల్లించడంతో పాటు హాస్పిటల్స్ లో సిబ్బందిని పెంచాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో సరైన రోడ్లు వేయించాలన్నారు. కేంద్రం నుంచి ఎస్టీల కోసం వచ్చిన ఫండ్స్ లెక్క చెప్పాలని కోరారు. నెల రోజుల్లో ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి వచ్చి పరిస్థితిని సమీక్షించాలని కోరారు.
లేదంటే ఆదివాసీలతో కలిసి ఆదిలాబాద్ జిల్లాను ఘోరావ్ చేస్తామని హెచ్చరించారు. ఏదో అషామాషీగా వచ్చి చూసి పోయే పార్టీ తమది కాదని సమస్య పరిష్కారమయ్యే వరకు వదిలిపెట్టబోమని అల్టిమేటం ఇచ్చారు. ప్రశ్నిస్తాం.. పోరాడుతాం.. పరిష్కరిస్తాం.. అనేది తమ విధానమన్నారు. ఇతర పార్టీల నాయకులు వస్తారు.. చూస్తారు.. వెళ్తారు.. అన్నట్లుగా వ్యవహరిస్తారని విమర్శించారు.
టీఆర్ఎస్ తరపున కమిటీ
ఆదిలాబాద్ జిల్లాలో చిన్నారులు, గర్భిణుల మరణాలు, ప్రజల హెల్త్ ప్రొఫైల్ కు సంబంధించి అధ్యయనానికి టీఆర్ఎస్ తరపున కమిటీ వేస్తామని ప్రకటించారు. తమ ఏర్పాటు చేసే కమిటీ ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై స్టడీ చేస్తుందన్నారు. జనం బాటలో భాగంగా ఆరు నెలల క్రితం వచ్చినప్పుడే ఇక్కడి సమస్యలను తాను ప్రస్తావించానని గుర్తు చేశారు. పచ్చని అడవులతో నిండి ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరముందన్నారు.
రిమ్స్ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం
రిమ్స్ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజలు బాధల్లో ఉంటే వారి బాధల్లో భాగస్వాములు కావాలని, నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై పోరాటం చేసి ఉంటే రిమ్స్ లో ఈ ప్రమాదం జరిగి ఉండేదని కాదన్నారు.
రిమ్స్ బాధితులకు పరామర్శ
రిమ్స్ ఎస్ఎన్ సీయూ అగ్ని ప్రమాదం ఘటన నుంచి బయట పడి ఆదిలాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్న బాధితలకు అందుతున్న వైద్యం గురించి కవిత డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. శిశువుల తల్లిదండ్రులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తరఫున సాయం అందేలా న్యాయం జరిగేలా చేస్తామని వారికి హామీ ఇచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి పిల్లలను కాపాడిన వాళ్లను అభినందించారు.
మృతుల కుటుంబాలకు రూ.50 వేల ఆర్థిక సాయం
రిమ్స్ ఆసుపత్రి ఎస్ ఎన్ సీయూలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురు చిన్నారుల కుటుంబాలకు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. ముగ్గురు చిన్నారుల కుటుంబాలకు మంగళవారం సాయంత్రమే సాయం అందజేయగా బుధవారం మిగతా ఇద్దరు చిన్నారుల కుటుంబ సభ్యులకు సాయం అందజేశారు. చిన్నారులను తిరిగి తెచ్చి ఇవ్వలేక పోయినా దుఃఖంలో ఉన్న కుటుంబాలకు భరోసా ఇవ్వాలన్నదే తమ సంకల్పం అన్నారు. (https://epaper.aadabhyderabad.in/), (Youtube)
