Tuesday, May 26, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంPOCSO | మైనర్ల రక్షణకు పోక్సో కవచం..

POCSO | మైనర్ల రక్షణకు పోక్సో కవచం..

అవగాహన కల్పించాల్సిన బాధ్యత లేదా..?

  • 18 ఏళ్లలోపు పిల్లల రక్షణ కోసం ప్రత్యేక చట్టం
  • తెలంగాణలో ప్రతి ఏడాది 5 వేలకుపైగా కేసులు
  • నిందితుల్లో 98 శాతం బాధితులకు తెలిసినవారే
  • లైంగికదాడులు, చైల్డ్ పోర్నోగ్రఫీపై కఠిన శిక్షలు
  • వారు ఒప్పుకున్నా.. మైనర్ల విషయంలో నేరమే..
  • కేసు దాచిపెట్టినా జైలు శిక్ష పడే అవకాశం
  • తప్పుడు పోక్సో కేసులపైనా చట్టంలో శిక్షలు
  • ఈ కేసుల్లో బెయిల్ కోర్టు విచక్షణపైనే ఆధారితం
  • అవగాహన పెరిగితేనే నేరాలకు అడ్డుకట్ట సాధ్యం

పాఠశాల స్థాయి నుంచే ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ’ అవగాహన అవసరం..
అత్యవసర సహాయం కోసం అందుబాటులో చైల్డ్‌లైన్ 1098, పోలీస్ 100/112

- Advertisement -

‘ఫోక్సో’ ఇప్పుడీ పదం ఎక్కువుగా వినిపిస్తోంది.. నిజానికి ‘ఫోక్సో’ గురించి ఇప్పటికీ చాలామందికి తెలియదు.. మైనర్ లైన పిల్లల భద్రతకోసం తీసుకొచ్చిన చట్టం ఇది.. విచిత్రం ఏమిటంటే ఎవరైతే మైనర్ పిల్లలు వున్నారో వారికి కూడా ఈ చట్టం గురించిన అవగాహన కల్పించడంలో ఇటు ప్రభుత్వాలు గానీ అటు న్యాయవయవస్థగానీ, తల్లిదండ్రులు, పోలీసులు ఎవరు కూడా దీనిపై సరైన శ్రద్ధపెట్టడం లేదన్నది నిర్విదాంశం..

ఎవరి కొరకు చట్టాలు చేస్తున్నామో వారికే ఆ చట్టాలపట్ల అవగాహన లేకపోవడం శోచనీయం.. పాఠశాలలో చదువుతున్నప్పుడే వారికి ఈ చట్టం గురించి క్షుణ్ణంగా తెలియజేయడం ఎంతో అవసరం అన్నది మేధావులు అంటున్న మాట.. అందుకే అసలు ‘ఫోక్సో’ చట్టం ఏమిటి..? ఎలా మేలుచేస్తుంది..? అన్న విషయాలపై అవగాహన కల్పించడానికి ‘ఆదాబ్ హైదరాబాద’ ఈ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది..

దేశవ్యాప్తంగా చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపులు, ఆన్‌లైన్ దుర్వినియోగ ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “పోక్సో చట్టం” అత్యంత కీలకమైన రక్షణ చట్టంగా మారింది. 18 ఏళ్లలోపు బాలబాలికలను లైంగిక నేరాల నుంచి కాపాడేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ఈ చట్టం 2012లో అమల్లోకి వచ్చింది. పిల్లలపై జరిగే లైంగిక దాడిని స్పష్టంగా నిర్వచించి, కఠిన శిక్షలను నిర్దేశించడం ఈ చట్టం ప్రత్యేకతగా చెప్పవచ్చు.

పోక్సో చట్టం ప్రకారం లైంగిక వేధింపులు, శారీరక దాడులు, అత్యాచారం, అశ్లీల ప్రదర్శనలు, ఆన్‌లైన్ లైంగిక వేధింపులు, చిన్నారుల అశ్లీల వీడియోల తయారీ, పంపిణీ వంటి చర్యలు తీవ్రమైన నేరాలుగా పరిగణించబడతాయి. నేర తీవ్రతను బట్టి మూడు సంవత్సరాల జైలు శిక్ష నుంచి జీవిత ఖైదు వరకు విధించే అవకాశం ఉంది. 2019లో చట్ట సవరణల తర్వాత అత్యంత దారుణమైన అత్యాచార కేసుల్లో మరణశిక్షకు కూడా అవకాశం కల్పించారు.

సాధారణ క్రిమినల్ కేసులతో పోలిస్తే పోక్సో చట్టంలో బాధిత చిన్నారుల రక్షణకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. కేసు నమోదు నుంచి విచారణ వరకు పిల్లలకు భయం కలగకుండా చర్యలు తీసుకోవాలని చట్టం స్పష్టం చేస్తోంది. చిన్నారుల వాంగ్మూలాన్ని మహిళా పోలీసులు లేదా ప్రత్యేక శిక్షణ పొందిన అధికారులు సేకరించాలి. కోర్టులో కూడా పిల్లలు నిందితుడిని నేరుగా ఎదుర్కోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అలాగే పోక్సో కేసుల విచారణ కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారు. కేసులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని న్యాయ వ్యవస్థకు మార్గదర్శకాలు ఉన్నాయి. బాధిత పిల్లలకు కౌన్సెలింగ్, వైద్య సహాయం, పునరావాసం వంటి సేవలు అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోంది.

పోక్సో చట్టంలో అత్యంత కీలక అంశం బాధితుల గోప్యత రక్షణ. చిన్నారి పేరు, ఫోటో, కుటుంబ వివరాలు, చిరునామా వంటి సమాచారాన్ని బయటపెట్టడం చట్ట విరుద్ధం. మీడియా సంస్థలు కూడా బాధితుల గుర్తింపు బయటపడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. సోషల్ మీడియా, మొబైల్ యాప్స్, గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా చిన్నారులను లక్ష్యంగా చేసుకునే ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో పోక్సో చట్టం సైబర్ నేరాలకూ వర్తిస్తోంది.

చిన్నారులతో అసభ్య సంభాషణలు, ఫోటోలు అడగడం, వీడియోల ద్వారా వేధించడం, అశ్లీల కంటెంట్ పంపించడం వంటి చర్యలు నేరాలుగా పరిగణించబడుతున్నాయి. సైబర్ క్రైమ్ విభాగాలు ఇటువంటి కేసులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి.పిల్లలకు ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ’పై అవగాహన కల్పించడం, పాఠశాలల్లో భద్రతా విధానాలు కఠినంగా అమలు చేయడం, తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనలో మార్పులను గమనించడం అత్యంత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. చట్టం ఎంత కఠినంగా ఉన్నా సమాజంలో అవగాహన, వేగవంతమైన న్యాయం, బాధితులకు మానసిక బలం కల్పించినప్పుడే చిన్నారులపై నేరాలను పూర్తిగా అరికట్టవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో ‘ఫోక్సో’ కేసుగురించి అందరూ చర్చించుకుంటున్నారు..

ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ‘ఫోక్సో’ అన్నది పాపులర్ అయిపొయింది..
తెలంగాణలో ఫోక్సో కేసుల గణాంకాలు (2026 జనవరి నుంచి) :

తెలంగాణలో ప్రతి సంవత్సరం సగటున 5,000 నుండి 6,000 వరకు పోక్సో కేసులు నమోదవుతున్నాయి. అంటే నెలకు సుమారు 450 నుండి 500 వరకు కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ( ఈ వివరాలు అంతర్జాలం నుంచి సేకరించబడ్డాయి.. ) సాధారణంగా ప్రతి కేసులో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మందిపై కేసులు పెడుతుంటారు. 2025 గణాంకాల ప్రకారం, నిందితుల్లో దాదాపు 98శాతం మంది బాధితులకు తెలిసిన వారే అంటే బందువులు, స్నేహితులు, పొరుగువారు ఉంటున్నారు. కానీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఇన్ని కేసులు నమోదవుతున్నా ఆ వివరాలు ఎవరికీ తెలియడం లేదు..

ప్రజాస్వామ్యంలో ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కరికీ తెలియవలసిన అవసరం వుంది.. ఎందుకంటే తమ కళ్ళముందు ఇలాంటివి జరిగినప్పుడు వెంటనే స్పందించే అవకాశం ఉంటుంది.. అదే విధంగా కేవలం ఒక ‘ఫోక్సో’ కేసు వెనకాల రాజకీయ పార్టీలన్నీ పడుతూ రాద్దాతం చేయడం కూడా మనం చూశాం.. రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయి.. వాటిమీద స్పందించే సమయం లేని సోకాల్డ్ నాయకులు ఒక కేసును పట్టుకుని వేలాడటం దేనికి సంకేతం.. మిగతా కేసుల మీద ఎందుకు స్పందించడం లేదన్నది ఇక్కడ అర్ధంకాని ప్రశ్నగా మిగిలిపోయింది.. అలాగే ఇప్పుడు ‘ఫోక్సో’ ను దుర్వినియోగం చేయడానికి కూడా ఆస్కారం ఉంటుందన్నది కూడా ఆందోళనకరంగా మారింది..

పోక్సో చట్టం : సెక్షన్లు – కఠిన శిక్షల వివరాలు :

పోక్సో చట్టం కింద నేర తీవ్రతను బట్టి శిక్షలు ఉంటాయి. ముఖ్యంగా 2019 సవరణలు, 2024 తాజా తీర్పుల ప్రకారం శిక్షల వివరాలు ఇలా ఉన్నాయి..
సెక్షన్ 3, 4 శరీర ప్రవేశ లైంగిక దాడి ఈ సెక్షన్ ప్రకారం కనీసం 10 ఏళ్ల జైలు నుండి యావజ్జీవంతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంది..
సెక్షన్ 5, 6 తీవ్రమైన శరీర ప్రవేశ లైంగిక దాడి అంటే రక్షించాల్సిన వారే భక్షించినా.. గాయపరిచినా.. కనీసం 20 ఏళ్ల జైలు నుండి మరణశిక్ష వరకు..
సెక్షన్ 7, 8 శారీరక లైంగిక వేధింపు అంటే ప్రవేశం లేకుండా లైంగిక ఉద్దేశంతో తాకడం లాంటివీగి చేస్తే కనీసం 3 ఏళ్ల నుండి 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది..
సెక్షన్ 9, 10 తీవ్రమైన శారీరక లైంగిక వేధింపు.. అంటే అధికారంలో ఉన్న పోలీసులు, ఉపాధ్యాయులు కనుక చేస్తే.. కనీసం 5 ఏళ్ల నుండి 7 ఏళ్ల వరకు జైలు విధిస్తారు.. సెక్షన్ 11, 12 లైంగిక వేధింపు అంటే తాకకుండా మాటలు, సంజ్ఞలు, సైబర్ వేధింపుల ద్వారా వేధిస్తే.. కనీసం 3 ఏళ్ల వరకు జైలు శిక్ష దానితో బాటు జరిమానా కూడా విధిస్తారు.. సెక్షన్ 13, 14, 15 చైల్డ్ పోర్నోగ్రఫీ అంటే పిల్లల అశ్లీల చిత్రాలు తీయడం, వ్యాప్తి చేయడం, నిల్వ చేయడం వంటి నేరం చేస్తే.. కఠిన జైలు శిక్ష, దానితోబాటు భారీ జరిమానా విధించే అవకాశం వుంది..

చట్టం యొక్క 5 అత్యంత కఠినమైన నిబంధనలు :

సాధారణ క్రిమినల్ చట్టాలకు, పోక్సో చట్టానికి చాలా తేడా ఉంది. ఈ చట్టం నిందితుల పట్ల అత్యంత కఠినంగా ఉంటుంది.. నేరం నిరూపించుకోవాల్సిన బాధ్యత నిందితుడిదే.. సెక్షన్ 29 ప్రకారం సాధారణంగా కోర్టుల్లో నేరం రుజువు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది. కానీ పోక్సోలో ‘నిందితుడే’ తాను తప్పు చేయలేదని కోర్టులో నిరూపించుకోవాలి.

ఇది నాన్-బెయిలబుల్ నేరం. అరెస్ట్ చేయడానికి పోలీసులకు వారెంట్ అవసరం లేదు. బెయిల్ అనేది హక్కుగా రాదు, కోర్టు విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది. అలాగే 18 ఏళ్ల లోపు పిల్లల ‘సమ్మతి’ కి చట్టపరంగా ఎలాంటి విలువ లేదు. “ఆ పిల్లవాడు/బాలిక ఒప్పుకుంది కాబట్టే చేశాను” అని నిందితుడు చెప్తే చట్టం అస్సలు ఒప్పుకోదు. అదేవిధంగా రిపోర్ట్ చేయకపోవడం కూడా నేరమే (సెక్షన్ 19) పిల్లలపై లైంగిక దాడి జరిగిందని లేదా జరగబోతుందని తెలిసి కూడా సమాచారం దాచితే, సదరు వ్యక్తికి (తల్లిదండ్రులు/ఉపాధ్యాయులు ఎవరైనా) 6 నెలల జైలు శిక్ష పడుతుంది.

రహస్య విచారణ, మీడియా గోప్యత :

బాధితుల వివరాలు, ఫోటోలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదు. విచారణ కూడా కెమెరా ముందే (ఇన్-కెమెరా ప్రొసీడింగ్స్) సాగుతుంది.

మైలురాయి లాంటి సుప్రీం కోర్టు తీర్పులు :

చట్టాన్ని మరింత స్పష్టం చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన కొన్ని చారిత్రాత్మక తీర్పులు ఇవే

  1. స్కిన్-టు-స్కిన్ తీర్పు (2021) : “బట్టల పైనుంచి తాకితే పోక్సో వర్తించదు” అన్న బాంబే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. ‘లైంగిక ఉద్దేశం’ ఉందా లేదా అన్నదే ముఖ్యం.. కానీ, చర్మం నేరుగా తాకాలా లేదా అనేది ముఖ్యం కాదని తేల్చి చెప్పింది.
  2. చైల్డ్ పోర్నోగ్రఫీ నిల్వ చేయడంపై తీర్పు (2024) : పిల్లల అశ్లీల చిత్రాలను, వీడియోలను ఇతరులకు షేర్ చేయకపోయినా.. కేవలం ఫోన్లలో లేదా గ్యాడ్జెట్లలో డౌన్‌లోడ్ చేసుకుని నిల్వ ఉంచడం, చూడటం కూడా పోక్సో సెక్షన్ 15 కింద నేరమే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
  3. చట్టం దుర్వినియోగంపై న్యాయస్థానాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.. పోక్సో చట్టం పిల్లల రక్షణకు బ్రహ్మాస్త్రం లాంటిదే అయినా, కొన్ని సందర్భాల్లో ఇది దుర్వినియోగం అవుతుండటంపై కోర్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యుక్తవయసు ప్రేమలు ఇలాంటివే.. టీనేజ్ వయసులో పరస్పర ఇష్టంతో ఉన్న ప్రేమ జంటలపై, అమ్మాయి తరపు తల్లి దండ్రులు పగతో ఈ కేసులు పెడుతున్నారు. వ్యక్తిగత కక్షాలైన ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు, లేదా ఉపాధ్యాయులపై కోపంతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. పోక్సో సెక్షన్ 22 ప్రకారం కావాలని తప్పుడు ఫిర్యాదులు చేసిన వారికి కూడా చట్టంలో కఠిన శిక్షలు ఉన్నాయి.

ఈ చట్టం ఉద్దేశం పిల్లలను వేధింపుల నుండి రక్షించడమే కానీ, తప్పుడు కేసులతో ఇతరుల జీవితాలను నాశనం చేయడం కాదు. అత్యవసర సమయంలో ఏం చేయాలి? తల్లిదండ్రులు, బాధితులకు గైడ్ లు మీకు తెలిసిన ఏ పిల్లలకైనా అన్యాయం జరుగుతుందని అనిపిస్తే తక్షణమే స్పందించండి.. దీనికోసం సహాయక నంబర్లు.. చైల్డ్ లైన్ – 1098 (ఉచితం, 24 గంటలు పనిచేస్తుంది) లేదా పోలీస్ – 100 / 112, మహిళా హెల్ప్ లైన్ – 181 కి సమాచారం ఇవ్వండి.

స్టేషన్ పరిధితో పనిలేదు.. ఏ పోలీస్ స్టేషన్‌లోనైనా ‘జీరో ఎఫఐఆర’ నమోదు చేయవచ్చు. మా పరిధి కాదు అని పోలీసులు చెప్పడానికి వీల్లేదు.వైద్య పరీక్షలు: నేరం జరిగిన 24 గంటల లోపు మెడికల్ ఎగ్జామినేషన్ చేయించడం కేసు బలానికి అత్యంత కీలకం. ఒకవేళ ఎవరిపైనైనా తప్పుడు ఆరోపణలతో వస్తే, తక్షణమే అనుభవజ్ఞుడైన క్రిమినల్ లాయర్‌ను సంప్రదించాలి. నిర్దోషిత్వాన్ని నిరూపించే స్కూల్ సర్టిఫికెట్లు, సీసీటీవీ ఫుటేజ్ లేదా ఇతర ఆధారాలను సిద్ధం చేసుకోవాలి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News