- పేదరికం నుంచి ఊహించని స్థాయికి..
- ప్రపంచ యువతకు స్ఫూర్తిదాయకం..
ఒకప్పుడు వర్క్‌షాప్‌లో కరెంట్ కట్ కాకుండా ఉండడం కోసం విద్యుత్ సంస్థను గడువు అడిగిన వ్యక్తి.. నేడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరిగా నిలిచారు. కంప్యూటర్‌కు విద్యుత్ ఉంటే చాలు.. అదే తన భవిష్యత్తును మార్చేస్తుందని నమ్మిన ఆ యువకుడు, తర్వాత ఏకంగా ఓ ద్వీపాన్నే కొనుగోలు చేసే స్థాయికి ఎదిగారు. ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్ ప్రయాణం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిదాయక కథగా నిలిచింది.
లారీ ఎలిసన్ కెరీర్ ప్రారంభ దశ అంతా కష్టాలతోనే సాగింది. 1970ల్లో చిన్న గ్యారేజ్‌లో సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేస్తూ వ్యాపారాన్ని మొదలుపెట్టారు. చేతిలో డబ్బు లేక విద్యుత్ బిల్లు కూడా పూర్తిగా చెల్లించలేని పరిస్థితి ఎదురైంది. విద్యుత్ నిలిపివేయొద్దని కంపెనీలను కోరుతూ, బిల్లులో కేవలం 10 శాతం చెల్లించి మిగతా మొత్తం తర్వాత ఇస్తానని ఒప్పందం చేసుకున్నారు. ఇంట్లో లైట్లు, ఇతర సౌకర్యాల కోసం కాదు.. తన కంప్యూటర్ పనిచేయాలంటే విద్యుత్ తప్పనిసరి కావడంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఎలిసన్ తర్వాత గుర్తు చేసుకున్నారు.
ఆయన బాల్యం అంత సాఫీగా సాగలేదు. దత్తత తీసుకున్న తర్వాత బంధువుల వద్ద పెరిగారు. చికాగో విశ్వవిద్యాలయంలో చదువు మధ్యలోనే మానేశారు. వ్యాపారం ప్రారంభించేందుకు పెట్టుబడుల కోసం వెంచర్ క్యాపిటల్ సంస్థల కార్యాలయాల చుట్టూ తిరిగినా ఎవరూ కలిసేందుకు కూడా ముందుకు రాలేదని ఆయన చెప్పుకొచ్చాడు.
