- షోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం..
- హువావే సీఈఓ రెం జెంగ్ ఫీపై వార్తలు..
ప్రముఖ చైనా టెక్ దిగ్గజం హువావే(Huawei) వ్యవస్థాపకుడు, సీఈవో రెన్ జెంగ్ఫీ దేశం విడిచి వెళ్లారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. చైనాలో నేటి నుంచి కఠినమైన నిష్క్రమణ నియంత్రణ చట్టాలు అమల్లోకి వచ్చిన తరుణంలో ఈ వదంతులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే, ఈ వార్తలకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేదు.
చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో పాటు ‘ఎక్స్’లో వైరల్ అవుతున్న పోస్టుల ప్రకారం, సెప్టెంబర్ 11వ తేదీ నుంచే రెన్ జెంగ్ఫీ, ఆయన భార్య, కుమార్తె సహా పది మందికి పైగా కుటుంబ సభ్యులు ఎవరికీ అందుబాటులో లేరని సమాచారం. అర్ధరాత్రి వేళ ఆయన నివాసం నుంచి ఒక వాహనం షెన్జెన్లోని తీర ప్రాంతం వైపు వెళ్లినట్లు, వారు సముద్ర మార్గం ద్వారా దేశం విడిచి పారిపోయి ఉండవచ్చని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
దీనికి తోడు, షెన్జెన్లోని హువావే(Huawei) ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారని, ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం లేదంటూ కొన్ని అంతర్గత చాట్ స్క్రీన్షాట్లు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఇవన్నీ బలహీనమైన ఆధారాలతో కూడిన కథనాలని, వీటిని సులభంగా సృష్టించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
చైనాలో పారిశ్రామిక, సాంకేతిక భద్రతకు ముప్పు కలిగించే వారు దేశం విడిచి వెళ్లకుండా నిరోధించేందుకు రూపొందించిన కొత్త నిబంధనలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సాంకేతిక రంగంలోని కీలక వ్యక్తులపై ప్రభుత్వం నిఘా పెంచుతోందన్న ఆందోళనల మధ్య రెన్ జెంగ్‌ఫీపై ఈ వదంతులు వ్యాపిస్తున్నాయి. ఈ ప్రచారంపై అటు హువావే సంస్థ కానీ, ఇటు చైనా ప్రభుత్వం కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
