Saturday, May 2, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంEncroachment | రాజకీయ అండతో భూ దందా..!

Encroachment | రాజకీయ అండతో భూ దందా..!

  • ఖానమేట్లో వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు స్వాహా
  • బహిర్గతమైన భూ దందా.. అధికారుల నిర్లక్ష్యం
  • రికార్డుల్లో గందరగోళం.. ఇదే అదనుగా ఆక్రమణలు
  • కోర్టుల్లో ఒక మాట.. భూ భారతిలో మరోలా
  • ప్రభుత్వ పెద్దల సహకారం ఉందంటూ ఆరోపణలు
  • పరోక్షంగా అధికారుల మద్దతు కూడా ఉందా..?

ఒకటి కాదు రెండు కాదు.. ఎన్నెన్నో కబ్జాలు.. ప్రభుత్వ భూములపై పాడగా విప్పుతాడు.. శేరిలింగం పల్లిలో అధికారులను, స్థానికులను షేక్ చేస్తాడు.. ఆయన కన్నుపడిందంటే చాలు విలువైన ప్రభుత్వ భూములు హాం ఫట్ అనాల్సిందే.. ఆయనను కట్టడి చేయడానికి ఏ అధికారి కూడా సాహసించడం లేదు.. ఏ రాజకీయ నాయకుడు ముందుకు రావడం లేదు.. కళ్ళముందే కబ్జాల పర్వం కొనసాగుతున్నా.. ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారన్నది స్థానికులు అంటున్న మాట.. ఖానామేట్ లో జరుగుతున్న కబ్జాల తతంగం విస్తుపోయేలా చేస్తోంది..

కబ్జాలను యథేచ్ఛగా కొనసాగిస్తూ కాలర్ ఎగరేసుకుని దర్జాగా, నిర్భయంగా తిరుగుతున్న ఆ వ్యక్తి అమర్నాథ్ రెడ్డి.. అసలు ఎవరీయన..? ఎందుకింద పబ్లిక్ గా రెచ్చిపోతున్నాడు..? ప్రభుత్వానికి, అధికారులకు కొరకురాని కొయ్యగా ఎందుకు తయారయ్యాడు.. వ్యవస్థలు ఆయనకు భయపెడుతున్నాయా..? లేక అమ్ముడుబోయాయా.. ? ఆక్రమించిన భూముల్లో ఎన్నో నిర్మాణాలు చేసి, అమ్మేసి కోట్లు కొల్లగొట్టినా.. అతడిపై చర్యలు జరగడం లేదంటే.. ఆయనకున్న పరపతి ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు.. ఆయన చేస్తున్న కబ్జాలు చూస్తుంటే ఎవరికైనా మతిపోవాల్సిందే.. ప్రస్తుతం ఆయన కబ్జాల పర్వంలో భాగంగా ఖానామేట్ లో వెలుగుచూసిన అక్రమ భాగోతం మీకోసం..

- Advertisement -

రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలంలోని ఖానమేట్ గ్రామంలో ప్రభుత్వ భూముల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక్కడ గజం రెండు లక్షల రూపాయలు ఆపై మాటే.. కాగా సర్వే నంబర్లు 41/1 నుంచి 41/13 వరకు వున్న భూములు 1961లో 13 మంది ఎస్సీ, బీసీ, మైనారిటీలకు ల్యాండ్ లెస్ పూర్ కోటా కింద అసైన్డ్ చేసిన భూములు.. అలాగే 22, 23, 24, 45, 46 యూ.ఎల్.సి., ఇతర ప్రభుత్వ భూముల రికార్డులు పూర్తిగా గందరగోళంలో ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఒకవైపు అధికారులు అసైన్డ్ భూములు ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ యాక్ట్, 1977 ప్రకారం భూములను రెజ్యూమ్ చేశామని కోర్టుల్లో వాదిస్తుండగా.. అదే భూభారతి రికార్డుల్లో ఇప్పటికీ అసైనీలు, కొంతమంది కొనుగోలుదారుల పేర్లు కనిపించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ రికార్డుల్లోని లోపాలను ఆసరాగా చేసుకుని కొందరు భూ బకాసురులు కోట్ల విలువైన భూములను ఆక్రమిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ముఖ్యంగా అమర్నాథ్ రెడ్డి అనే వ్యక్తి పాత్రపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.. అధికారులు మాత్రం ఇతడిని కట్టడి చేయలేక పోతున్నారా..? లేక అతడి తో కలిసి పోతున్నారా..? జనాలకు అర్థం కావడం లేదు. గతంలో బీ.ఆర్.ఎస్. నేతల రాజకీయ ఆశ్రయంతో కబ్జాల పర్వం కొనసాగించాడని.. ప్రస్తుతం కూడా అధికార పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడి సోదరుల పేర్లు చెబుతూ.. అసలు హక్కుదారులను బెదిరిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇకపోతే, హైడ్రా, కలెక్టర్, రెవెన్యూ అధికారులు వంటి కీలక వ్యవస్థలు ఈ వ్యవహారంపై మౌనం వహించడం మరింత అనుమానాలకు దారి తీస్తోంది. సాధారణ ప్రజలపై కఠినంగా వ్యవహరించే అధికార వ్యవస్థలు ఇక్కడ ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

కాగా 1961లో అసైన్ చేసిన భూములపై ఇప్పటికీ రికార్డుల లోపం కనిపిస్తోంది అసలు స్పష్టత లేదు.. యూ.ఎల్.సి., ఇతర ప్రభుత్వ భూముల వివరాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.. కోర్టుల్లో “రెజ్యూమ్ చేశాం” అంటున్న అధికారులు.. భూభారతిలో మాత్రం పాత పేర్లే కనిపిస్తున్నాయి.. ఇది ఎక్కడి న్యాయం..? రికార్డులు సరిచేయకపోవడం వల్ల ఆక్రమణలకు మార్గం సుగమం అయిందని చెప్పవచ్చు.. ఇది అధికారుల పరోక్ష సహకారమే కదా..? అని ప్రశ్నిస్తున్నారు పలువురు..

కాగా అమర్నాథ్ రెడ్డి పాత్రపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. దాదాపు లక్షకు పైగా గజాలు తన గుప్పిట్లో పెట్టుకున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. ఆ భూమిని హైడ్రా అధికారులు ఎందుకు కాపాడలేకపోతున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది.. హైడ్రా అధికారులకే ఈయన సవాలు విసురుతున్నాడన్నది విశ్లేషకుల వాదన.. గత ప్రభుత్వ కాలంలో రాజకీయ మద్దతుతో కబ్జాలు కొనసాగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. ప్రస్తుత అధికార పార్టీ నేత సోదరుల పేర్లు చెప్పి బెదిరింపులు చేస్తున్నారనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి..

అసలు అసైనీ వారసులు భయాందోళనలో ఉన్నారని తెలుస్తోంది.. హైడ్రా, కలెక్టర్, రెవెన్యూ యంత్రాంగం మౌనం పై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.. లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ప్రమాదంలో పడిపోయాయి.. నియమాలు, చట్టాలు అమలు కావడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.. శేరిలింగంపల్లి మండలంలోని అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నది.. ఇప్పటికైనా ప్రభుత్వం సంబంధిత అధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించి కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రక్షించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు..

ప్రభుత్వ భూముల రికార్డులను తక్షణమే సరిచేయాలి.. ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.. అసలు హక్కుదారులకు న్యాయం చేయాలి.. రెవెన్యూ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలి.. రాజకీయ ప్రభావం లేకుండా విచారణ జరపాలి. “సామాన్యులకు ఒక చట్టం, ప్రభావవంతులకు మరో చట్టమా?” అనే ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో తీవ్రంగా మార్మోగుతోంది. కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కాపాడడంలో ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించాలన్న డిమాండ్ పెరుగుతోంది. మరో కథనంలో కోర్టులను మోసగిస్తున్న అధికారుల తీరు, అమర్నాద్ రెడ్డి ఆక్రమణ పర్వము, అస్తవ్యస్థంగా ఉన్న రికార్డుల గూర్చి వెలుగులోకి తీసుకుని రానుంది

“ఆదాబ్ హైదేరాబద్” “మా అక్షరం అవినీతిపై అస్త్రం”.

- Advertisement -
RELATED ARTICLES

Latest News