జోనల్ కమిషనర్ మౌనం వెనుక మతలబేంటి..?
- ఆదిభట్లలో ఆగని అక్రమ నిర్మాణాలు..
- ఎన్నో ఫిర్యాదులు.. పత్రికల్లో ఎన్నెన్నో కథనాలు..
- చర్యలు తీసుకోవడానికి వెనుకంజవేస్తున్న అధికారులు..
- ఆదిభట్లలో అక్రమ నిర్మాణాలకు ఊతమిస్తున్న జెడ్.సీ..?
- ఫిర్యాదులపై జాప్యం వెనుక ముడుపుల ఆరోపణలేనా?
- జెడ్.సి. కే. చంద్రకళ, డీసీ బీ. సత్యనారాయణ రెడ్డి, ఏసీపీ శ్రీధర్‌రెడ్డి తీరుపై అనుమానాలు..?
- ఉన్నతాధికారులు దృష్టిసారించాలంటున్న సామాజికవేత్తలు..
ఆదిభట్లలో అధికారులు తమ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నారా..? అంటే లేదనే సమాధానం వస్తుంది.. విధినిర్వహణలో అలసత్వం చూపించడం.. అవినీతికి సహకరించడం.. లంచాలు తీసుకోవడం సాధారణ విషయంగా మారిపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. ఆదిభట్ల సర్కిల్ 15 – దీనికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వదిలేస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.. పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులనుండి ఎలాంటి స్పందన కనిపించలేదు.. ఈ అక్రమ వ్యవహారాలపై ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని పలువురు కోరుతున్నారు.. ఈ అక్రమ వ్యవహారాలపై ఇప్పటికే పలుమార్లు ఆదాబ్ ఆధారాలతో సహా కథనాలను వెల్లడించిన అధికారుల్లో ఇసుమంతైనా కదలికలేకపోవడం గమనార్హం..
జీహెచఎంసీ శంషాబాద్ జోన్ పరిధిలోని, ఆదిబట్ల సర్కిల్ -15లో అక్రమ నిర్మాణాలు, అనధికారిక అదనపు అంతస్తులపై వరుసగా ఫిర్యాదులు వస్తున్నప్పటికీ చర్యలు ఎందుకు కనిపించడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డిప్యూటీ కమిషనర్‌కు, శంషాబాద్ జోన్ జోనల్ కమిషనర్‌కు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ నిర్మాణాలు యథావిధిగా కొనసాగుతున్నాయని, అలాగే కొన్ని నిర్మాణాలు పూర్తయ్యే దశకు చేరుకున్నాయని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు.
కాగా మంజూరైన బిల్డింగ్ ప్లాన్‌కు విరుద్ధంగా అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారని, అనుమతించిన నిర్మాణ పరిమితులను దాటి పనులు జరుగుతున్నాయని ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ‘ఆదాబ్ హైదరాబాద’ పత్రికలో కూడా పలుమార్లు కథనాలు ప్రచురితమైనప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు లేకపోవడంపై స్థానికులు, ఫిర్యాదుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

జోనల్ కమిషనర్‌కు ఎన్నో ఫిర్యాదులు..
అయినా కనిపించని ఫలితం..? :
అక్రమ నిర్మాణాలపై ఆదిబట్ల సర్కిల్ – 15 డిప్యూటీ కమిషనర్‌కు ఫిర్యాదులు చేయడంతో పాటు, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు శంషాబాద్ జోన్ జోనల్ కమిషనర్‌ను కూడా ఆశ్రయించినట్లు ఫిర్యాదుదారులు చెబుతున్నారు. నిర్మాణాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, మంజూరైన ప్లాన్‌తో ప్రస్తుత నిర్మాణాన్ని పోల్చి చూడాలని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను తక్షణమే నిలిపివేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరినప్పటికీ, ఫిర్యాదులపై జాప్యం జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు.
“అధికారులకు ఫిర్యాదు చేసినా నిర్మాణాలు ఆగడం లేదు.. పత్రికల్లో కథనాలు వచ్చినా చర్యలు కనిపించడం లేదు.. మరి అధికారులు ఎప్పుడు స్పందిస్తారు?” అని ఫిర్యాదుదారులు ప్రశ్నిస్తున్నారు.

చర్యల జాప్యం వెనుక ముడుపుల ఆరోపణలేనా? :
ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడంలో జరుగుతున్న జాప్యంపై ఇప్పుడు మరో తీవ్రమైన ఆరోపణ తెరపైకి వస్తోంది. అక్రమ నిర్మాణాలను నిలిపివేయకుండా, ఫిర్యాదులపై చర్యలను ఆలస్యం చేయడానికి కొందరు అధికారులు ముడుపులు స్వీకరిస్తున్నారనే ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి.అయితే ఈ ఆరోపణలకు సంబంధించి నిర్ధారిత ఆధారాలు లేదా అధికారికంగా ధృవీకరించబడిన సమాచారం ప్రజల ముందుకు రావాల్సి ఉంది. అందువల్ల ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉందని ఫిర్యాదు దారులు కోరుతున్నారు.
ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు జాప్యం జరిగింది? ఎవరి ఆదేశాలతో ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి? ఈ అక్రమాల వెనుక చక్రం తిప్పుతున్న వారెవరు..? నిర్మాణాలు కొనసాగుతున్న విషయం అధికారుల దృష్టికి వచ్చిన తర్వాత కూడా ఎందుకు అడ్డుకోలేదు? అనే ప్రశ్నలకు జోనల్ కమిషనర్ స్పష్టమైన సమాధానం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

అక్రమ నిర్మాణాలు పూర్తయ్యే వరకు వేచి చూస్తున్నారా?
అక్రమ నిర్మాణంపై ఫిర్యాదు వచ్చిన వెంటనే అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ అయితే నిర్మాణాన్ని ప్రారంభ దశలోనే నిలిపివేయాల్సి ఉందని స్థానికులు అంటున్నారు. అలా కాకుండా ఫిర్యాదులు అందిన తర్వాత కూడా నిర్మాణాలు కొనసాగి, చివరకు భవనాలు పూర్తయితే పరిస్థితి ఏమిటి..? దీనికి కారణం అధికారుల నిర్లక్ష్యమా? లేక కావాలనే చర్యలు తీసుకోవడం ఆలస్యం చేస్తున్నారా? అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
నిబంధనలకు వ్యతిరేకంగా అదనపు అంతస్తులు పూర్తయిన తర్వాత చర్యలు తీసుకోవడం వల్ల సమస్య మరింత క్లిష్టంగా మారడంతో పాటు, పార్కింగ్, ట్రాఫిక్, మౌలిక వసతులు, అగ్నిమాపక భద్రత తదితర అంశాలపై ప్రభావం పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదిభట్ల సర్కిల్ – 15లో జరుగుతున్న వ్యవహారాలపై మరిన్ని ఆధారా లతో మరో కథనం ద్వారా వెలుగులోకి తీసుకుని రానుంది.
