- ఆగస్టు 30…జమున జన్మదినం
జనాభాయి అనే పేరు తెలిసిన వారు ఎవరూ ఉండక పోవచ్చు. అలాగే జూలూరి జమున గురించి కూడా ఎవరికీ తెలియక పోవచ్చు. ఈ రెండు పేర్లు తెలుగు సినిమా రంగానికి చెందిన ఒక అగ్ర శ్రేణి కథానాయకురాలికి సంబంధించినవే అంటే ఔరా అనిపించక మానదు. అంతే కాదు. ఆమె తెలుగు మాతృభాష కాకపోయినా తెలుగు నేలలో పెరిగి, తెలుగు చలన చిత్ర సీమలో అరుదైన కథానాయికగా గుర్తింపు పొందిన తార అంటే ఆశ్చర్యం కలుగ మానదు.
ఆమే అర్ధ శతాబ్దం క్రితం సినీ రంగంలో కాలూని, వెండి తెరపై నడయాడి, ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానాన్ని పొందిన లిజెండ్, జూలూరి జమున లేదా జమునా రమణారావు లేదా జమునగా సుపరిచితురాలు అయిన ఒకనాటి తెలుగు మేటి సినీ నటి. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హీరోయిన్లుగా కొనసాగిన వాళ్లు చాలా మందే వున్నారు. కేవలం కొంతమంది మాత్రమే తమ నటనా ప్రతిభతో సుధీర్ఘ కాలం పరిశ్రమలో, ప్రేక్షకుల్లో తమదైన ముద్రలను వేసుకున్నారు. అలాంటి ప్రతిభ గల మేటి పారతరం తారల్లో జమున ఒకరు.
జమున 1936 ఆగష్టు 30 న హంపీలో పుట్టారు. ఆమె తల్లి కౌసల్యాదేవి తండ్రి వ్యాపారవేత్త నిప్పని శ్రీనివాసరావు. బాల్యం గడిచింది గుంటూరు జిల్లా దుగ్గిరాలలో. జమునకు ముందుగా పెట్టిన పేరు జనాభాయి. జన్మ నక్షత్రం రీత్యా ఏదైనా నది పేరు ఉండాలని జ్యోతిష్కులు సూచించడంతో మధ్యలో ‘ము’ అక్షరం చేర్చి జమునగా మార్చారు. ఉత్తరాది వారు యమునను జమునగా పిలవడం నేపథ్యంగా ఆమెకు ఆ పేరు స్థిరీకరించారు.
సినిమా కోసం ప్రత్యేకంగా ఆమె పేరు మార్చలేదు. సినీనటుడు జగ్గయ్యదీ అదే గ్రామం కావడం వల్ల జమున కుటుంబానికి జగ్గయ్యతో కొంత పరిచయం ఉంది. సహజంగా బెరుకు అంటూ లేని జమున స్కూలులో చదివే కాలంలో నాటకాల పట్ల ఆకర్షితురాలు కావడం జరిగింది. బాల్యంలోనే జమున సంగీతంలో కూడా శిక్షణ తీసుకున్నారు. ఆమె నటనకు ఎన్నో అవార్డులు సైతం లభించాయి.

తెనాలి సమీపంలోని మండూరు గ్రామంలో ‘ఖిల్జీ రాజ్య పతనం ‘ అనే నాటిక ప్రదర్శన కోసం ప్రత్యేకంగా జగ్గయ్య, జమునను ఎంపిక చేసుకుని తీసుకు వెళ్ళారు. ఆ నాటికలో మరో ప్రముఖ నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు కూడా నటించారు. అలా నాటకాలలో ఆమె ప్రతిభ బహిర్గతమై నలుమూలలకూ తెలవడం వల్ల సినిమా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. బి.వి.రామానందం తీసిన పుట్టిల్లు ఆమె తొలిచిత్రం. తరువాత అక్కినేని నాగేశ్వరరావు, జగ్గయ్య, నందమూరి తారక రామారావు తదితర నటుల సరసన నాయికగా నటించారు.
ఎన్ని పాత్రలలో నటించినా ఆమెకు బాగా పేరు తెచ్చింది సత్యభామ పాత్రే. ఆ పాత్రలో ఇప్పటికీ ఆమెను తప్ప మరొకరిని ఊహించు కోలేము అన్నట్టుగా అద్భుతంగా నటించారామె. వినాయక చవితి చిత్రంలో మొదటి సారి సత్యభామ పాత్రలో జమున కనిపిస్తుంది. ఆ తర్వాత శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో కూడా అదే పాత్ర వేశారు. ఈ సినిమాలో సత్యభామ ఆహార్యం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా లోని పాత్రే ఆమెకు గొప్ప పేరు తెచ్చింది.
ప్రధానంగా “మీర జాల గలడా నా యానతి” పాటపై సత్యభామలోని అన్ని లక్షణాలు కలబోసుకుని చేసిన ఆమె అభినయం, ఇప్పటికీ కళ్లముందు కదలాడుతూనే ఉంటుంది. సత్యభామ అంటే ఇలాగే వుంటుంది అనే భావన కలిగించారు జమున. కళపై ఉన్న మక్కువతో నాటకాల్లో బుర్రకథ ఫేం నాజర్ దగ్గర శిక్షణ తీసుకోవటం తన నట జీవితానికి పట్టం కట్టిందని చెపుతారు. సినీ నటీమణుల్లో , రాజకీయాలలో ప్రవేశించి రాణించిన కథానాయికలలో ఆమె తమ స్థానాన్ని పదిల పరచుకొన్నారు.

దివంగత ప్రధాని ఇందిరా గాంధీ అంటే ఉన్న అభిమానం, గౌరవం నన్ను రాజకీయాలలోకి లాక్కొచ్చాయి అని తన రాజకీయ జీవితం గురించి చెబుతారు జమున. ఆమె తెలుగు సినిమాలే కాక తమిళం, హిందీ సినిమాలలో కూడా నటించారు. ఆమె నటించిన మిస్సమ్మ, ఇల్లరికం, ఇలవేల్పు, లేత మనసులు, గుండమ్మ కథ చిత్రాలు విజయ వంతమై, రజతోత్సవాలు జరుపు కున్నాయి.
జమున చిన్నతనం నుండే నాటకాలలో నటించే వారు. జమున తల్లి ఆమెకు శాస్త్రీయ సంగీతం, హార్మోనీయంలలో శిక్షణ ఇప్పించారు. మా భూమి నాటకంలో జమున ఒక పాత్ర పోషించగా, ఆమె అభినయం నచ్చి ఆమెకు పుట్టిల్లు (1953)లో నటిగా అవకాశం ఇచ్చారు. ఆ సినిమాతో సినిమాల లోకి తెరంగేట్రం చేశారామె. తెలుగు, దక్షిణ భారత భాషల్లో కలిపి ఆమె 198 సినిమాలు చేశారు.
పలు హిందీ సినిమాలలో కూడా నటించారు. 1967లో ఆమె హిందీలో చేసిన మిలన్ సినిమా, 1964లో విడుదలైన మూగ మనసులు సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది. తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే సంస్థ నెలకొల్పి 25 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారామె.
1980లలో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజమండ్రి నియోజకవర్గం నుంచి 1989లో లోక్ సభకు ఎంపిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత రాజకీయల నుండి తప్పుకున్నా, 1990వ దశకంలో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేశారు. 1968లో ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు – మిలన్; 1964లో ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు – మూగ మనసులు; తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర గౌరవ పురస్కారం 1999, 2008లలో ఎన్.టి.ఆర్ జాతీయ పురస్కారం పొందారు. 89ఏళ్ల జమున వృద్యాప్త సంబంధిత వ్యాధులతో బాధపడుతూ 2023 జనవరి 27న హైదరాబాద్‌లోని స్వగృహంలో కన్నుమూశారు.
