- శ్రమ దోపిడీ – సౌకర్యాలు కరువు
- గ్రామాల్లో కనిపించని మెడికల్ కిట్స్, టెంట్స్
“ఒకవైపు నిలువునా దహించివేస్తున్న నడివేసవి ఎండలు.. ఇంకోవైపు పొట్టకూటి కోసం చెమటను రక్తంగా మారుస్తున్న ఉపాధి హామీ కూలీల ఆక్రందనలు. ఇంత జరుగుతున్నా, ఏసీ గదుల నుంచి కదలకుండా, ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కిన అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ‘ఆదాబ్ హైదరాబాద్’ ప్రత్యేక కథనం…”
”నిప్పులు చెరుగుతున్న భానుడు.. నిలువునా దహించివేస్తున్న ఎండ తీవ్రత.. అయినా పొట్టకూటి కోసం ఆ మండుటెండలోనే చెమట చుక్కలను చిందిస్తున్న ఉపాధి హామీ కూలీలు. కానీ, వారి శ్రమకు దక్కాల్సిన కనీస మర్యాద, సౌకర్యాలు మాత్రం ఎండమావులవుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలు కాగితాలకే పరిమితమవ్వగా, క్షేత్రస్థాయిలో అధికారులు మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.”
జగదేవ్ పూర్ మండలంలో ఉపాధి కూలీల కష్టం అంతో ఇంతో కాదు. వేసవి తీవ్రత దృష్ట్యా కూలీలకు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, వాటిని అమలు చేయడంలో స్థానిక అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. గ్రామాల్లో ఉపాధి పనులు దొరకడంతో పేద, ధనిక అనే తేడా లేకుండా రెక్కాడితే గాని డొక్కాడ నీ కూలీలంతా ప్రతిరోజు పనులకు వెళ్తున్నారు. కానీ, ఆ పని ప్రదేశాల్లో కనీస సదుపాయాలు లేకపోవడంతో కూలీలు నానా అవస్థలు పడుతున్నారు.

నిబంధనలు పాతర.. నీడ లేక అల్లాడుతున్న కూలీలు
ఉపాధి కూలీలు పని చేసే ప్రదేశాల్లో త్రాగడానికి స్వచ్ఛమైన నీరు, అత్యవసర వైద్యం కోసం మెడికల్ కిట్లు, ఎండ దెబ్బ తగలకుండా నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేయాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కానీ, మండలంలో ఏ ఒక్క గ్రామంలోనూ ఈ నిబంధనలు పాటించడం లేదు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పనులు చేస్తూ అలసిపోయిన కూలీలు..
కాసేపు విశ్రాంతి తీసుకుందామంటే కనీసం నీడ కూడా దొరకని అయోమయ స్థితిలో అల్లాడిపోతున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టెంట్లు ఏర్పాటు చేయకపోవడంతో, కూలీలు ఎక్కడో దూరంగా ఉన్న చెట్లను వెతుక్కుంటూ వెళ్లి సేద తీరాల్సిన దుస్థితి నెలకొంది. అధికారుల పర్యటనలు.. మౌన ప్రదర్శనలు ఉపాధి కూలీలు పనులు చేస్తున్న సమయంలో ఉన్నతాధికారులు వచ్చి తనిఖీలు (విజిట్) చేస్తున్నప్పటికీ, అక్కడ కనీస వసతులు ఉన్నాయా లేదా అని ప్రశ్నించే నాథుడే కరువయ్యాడు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉండవలసిన టెంట్లు, మెడికల్ కిట్లు లేకపోవడాన్ని గమనిస్తున్న అధికారులు.. మౌనంగా వెళ్ళిపోతున్నారే తప్ప, “సౌకర్యాలు ఎందుకు కల్పించలేదు?” అని కింది స్థాయి సిబ్బందిని నిలదీయడం లేదు. పనుల దగ్గరకు వచ్చినప్పుడు ఎండ తీవ్రతపై సలహాలు, సూచనలు ఇస్తున్నారే తప్ప, క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించడంలో మాత్రం పూర్తిగా విఫలమవుతున్నారు.
ఫొటోలకు పోజులు.. చేతులు దులుపుకున్న వైనం
”ఉపాధి పనులు ప్రారంభమై ఇన్ని రోజులవుతున్నా.. ఇప్పటివరకు కేవలం ఒక్కసారి మాత్రమే ఓఆర్ఎస్ (ORS) ప్యాకెట్లు పంపిణీ చేసి, ఫొటోలకు పోజులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు” అని కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఒక్క ఫొటోగ్రాఫ్ హడావుడి తర్వాత మళ్లీ అటువైపు చూసిన పాపాన పోలేదని వాపోతున్నారు.
అసలు అధికారులు ఉన్నారా.. లేరా..
గ్రామాల్లో అసలు అధికారులు ఉన్నారా లేదా అనే సందేహం కలుగుతోందని కూలీలు మండిపడుతున్నారు. కనీసం ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లు, టెంట్లు పంపిణీ చేయకపోవడంపై ఉపాధి కూలీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, జగదేవపూర్ మండలంలోని ఉపాధి హామీ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని, కూలీలకు వెంటనే అవసరమైన అన్ని వసతులను కల్పించి వారి ప్రాణాలకు రక్షణగా నిలవాలని మండల ప్రజలు, కూలీలు డిమాండ్ చేస్తున్నారు.
