ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేర్ హాస్పిటల్స్ అవగాహనా కార్యక్రమాలు
- ప్రపంచవ్యాప్తంగా 589 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు
- ప్రతి 30 సెకన్లకోసారి ఒకరు మధుమేహం వల్ల కాలు కోల్పోతున్నారు.
- డయాబెటిస్ ఉన్నవారిలో 19–34% మంది జీవితంలో ఏదో దశలో పాదపుండ్లను ఎదుర్కొంటారు
- ముందస్తు స్క్రీనింగ్, సరైన సంరక్షణతో ఇవి నివారించవచ్చు
- కేర్ హాస్పిటల్స్ ఉచిత స్క్రీనింగ్ శిబిరాలు
- “మీ చక్కెర తెలుసుకోండి” ప్రోగ్రామ్‌లు
- పాఠశాల “ఆరోగ్యకరమైన టిఫిన్” సెషన్‌లు
ప్రపంచ మధుమేహ దినోత్సవం(World Diabetes Day-నవంబర్ 14) నేపథ్యంలో కేర్ హాస్పిటల్స్ (Care Hospitals) హైదరాబాద్ (Hyderabad) వ్యాప్తంగా నెలరోజులపాటు డయాబెటిస్ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. మధుమేహాన్ని ముందుగానే గుర్తించడం, నివారించడం, తగిన సంరక్షణ తీసుకోవడం, అలాగే మధుమేహం వల్ల కలిగే సమస్యలు ముఖ్యంగా డయాబెటిక్ పాదం వంటి తీవ్రమైన పరిణామాలపై ప్రజల్లో అవగాహన పెంచడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం.
డయాబెటిస్ కేవలం శరీరాన్నే కాదు, మనసును కూడా ప్రభావితం చేస్తుంది. ఇది ఒక శారీరక వ్యాధి మాత్రమే కాదు, భావోద్వేగంగా, మానసికంగా కూడా పెద్ద ఒత్తిడిని కలిగిస్తుంది. డయాబెటిస్‌తో జీవిస్తున్న ప్రతి పది మందిలో ఏడుగురు ఉద్యోగ వయసులో ఉన్నవారే. అంటే, ఈ వ్యాధి పనితీరు, ఉత్పాదకత, మొత్తం ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతోంది.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (World Health Organisation) ప్రకటించిన 2025 ప్రపంచ మధుమేహ దినోత్సవ థీమ్ “జీవిత దశలలో మధుమేహం”(Diabetes in life stages). ఈ థీమ్ (Theme) ప్రతి దశలోనూ సమగ్ర సంరక్షణ మరియు జీవితాంతం మద్దతు అవసరాన్ని గుర్తు చేస్తుంది. కేర్ హాస్పిటల్స్ ఈ దార్శనికతను అనుసరిస్తూ కమ్యూనిటీ ఆధారిత అవగాహన, నివారణ మరియు సకాలంలో జోక్యంపై దృష్టి సారిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా నివాస ప్రాంతాలు, ఐటీ పార్కులు, మాల్స్‌లలో ఉచిత డయాబెటిస్ స్క్రీనింగ్ శిబిరాలు, ఉద్యోగుల కోసం “మీ చక్కెరను తెలుసుకోండి” (Know Your Sugar) కార్యాలయ అవగాహన కార్యక్రమాలు, అలాగే పిల్లల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు “ఆరోగ్యకరమైన టిఫిన్”(Healthy Tiffin) పాఠశాల సెషన్‌లు నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమాలు మధుమేహంపై ప్రజల్లో సమగ్ర అవగాహనను పెంపొందించి, ఆరోగ్యవంతమైన భవిష్యత్తు వైపు దారితీస్తాయి.
ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ (International Diabetes Federation) విడుదల చేసిన డయాబెటిస్ అట్లాస్ 2025 నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సుమారు 589 మిలియన్ల మంది పెద్దలు (20–79 ఏళ్లు) మధుమేహంతో బాధపడుతున్నారు. అంటే, ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి మధుమేహం ఉంది. ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ప్రతి 30 సెకన్లకోసారి ఒకరు మధుమేహం కారణంగా కాలు కోల్పోతున్నారు. దిగువ అవయవాల విచ్ఛేదనల్లో గణనీయమైన వాటా డయాబెటిక్ సమస్యల వల్లనే జరుగుతోంది. మధుమేహం ఉన్నవారిలో 19 నుంచి 34 శాతం మంది తమ జీవితంలో ఏదో దశలో పాదాల పుండుతో బాధపడతారని అధ్యయనాలు చెబుతున్నాయి. సకాలంలో సరైన సంరక్షణ తీసుకోకపోతే, ఈ పుండ్లు ఇన్ఫెక్షన్‌కి దారితీసి విచ్ఛేదన వరకు చేరే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పెరుగుతున్న ఆందోళనపై దృష్టి సారిస్తూ, కేర్ హాస్పిటల్స్ వాస్కులర్ మరియు ఎండోవాస్కులర్ సర్జరీ & వాస్కులర్ ఐఆర్ విభాగం క్లినికల్ డైరెక్టర్ మరియు విభాగాధిపతి డాక్టర్ పి. సి. గుప్తా మాట్లాడుతూ, డయాబెటిక్ పాదం అనేది డయాబెటిస్ వల్ల వచ్చే అత్యంత నిర్లక్ష్యం చేయబడిన కానీ అత్యంత ప్రమాదకరమైన సమస్యల్లో ఒకటి. ఇది మొదట తిమ్మిరి, చిన్న గాయాలు లేదా రక్తప్రసరణ తగ్గడం వంటి లక్షణాలతో నిశ్శబ్దంగా ప్రారంభమవుతుంది. కానీ దీన్ని నిర్లక్ష్యం చేస్తే, ఇది త్వరగా ఇన్ఫెక్షన్, గ్యాంగ్రీన్ మరియు అవయవ నష్టం వరకు దారితీస్తుంది. అయితే, రోగులను ముందుగానే పరీక్షించి సరైన చికిత్స అందిస్తే, ఈ సమస్యలలో చాలా వరకు పూర్తిగా నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు.
డయాబెటిస్ ఉన్న రోగులలో కూడా పాదాల సమస్యలపై అవగాహన తగినంతగా లేదని డాక్టర్ గుప్తా అన్నారు. చాలామంది జలదరింపు, తిమ్మిరి లేదా పాదాల్లో చిన్న గాయాలు వచ్చినా వాటిని లెక్కచేయరని ఆయన చెప్పారు. ఇందుకోసం బహుళ విభాగాల పాద సంరక్షణ క్లినిక్‌లు ఏర్పాటు చేయడం, ప్రజలకు రోజూ పాదాలు తనిఖీ చేసే అలవాటు కల్పించడం అవసరమన్నారు. అలాగే ప్రమాదంలో ఉన్న పాదాలను ముందుగానే గుర్తించి చికిత్స చేయడం కోసం ప్రాథమిక ఆరోగ్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు.
ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి – డయాబెటిస్‌తో బాధపడుతున్న నలుగురిలో ముగ్గురు, తమ అనారోగ్యం వల్ల ఆందోళన, నిరాశ లేదా ఇతర మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారని. అలాగే, ఐదుగురిలో నలుగురు ‘డయాబెటిస్ బర్నౌట్’ అనుభవిస్తున్నారని తెలిపారు – అంటే, ఆహారం, మందులు, జీవనశైలిని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా నియంత్రించాల్సిన పరిస్థితి వల్ల కలిగే మానసిక అలసట. ఈ వివరాలు చెబుతున్నాయి – డయాబెటిస్ కేవలం శారీరక వ్యాధి కాదు, ఇది కుటుంబాలు, ఉద్యోగ స్థలాలు, సమాజాన్ని సైతం ప్రభావితం చేసే మానసిక–సామాజిక సవాలుగా మారింది.

ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ కేర్ హాస్పిటల్స్ జోనల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బిజు నాయర్ మాట్లాడుతూ, “డయాబెటిస్ అనేది కేవలం ఒక వైద్య సమస్య కాదు, జీవితాంతం అవగాహనతో, జీవనశైలిలో మార్పులతో ఎదుర్కోవాల్సిన సవాలు. విద్య, ముందస్తు స్క్రీనింగ్‌లు, డయాబెటిక్ ఫుట్ వంటి సమస్యలను నివారించడం ద్వారా ప్రజలను మరింత జాగ్రత్తగా, శక్తివంతంగా మార్చడమే మా లక్ష్యం” అని చెప్పారు.
ఈ ప్రచారం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ మధుమేహ దినోత్సవం 2025 థీమ్ — “జీవిత దశలలో మధుమేహం” — కు అనుగుణంగా ఉంటుంది. ఇది అన్ని వయసుల వారికి మధుమేహంపై అవగాహన, నివారణ, అలాగే సమగ్ర మధుమేహ సంరక్షణ అందించడంలో కేర్ హాస్పిటల్స్ కట్టుబాటును మరోసారి తెలియజేస్తుంది.
